Wednesday, September 22, 2021

అక్కడ ఇక బాతాఖానీ బంద్

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అది ఒక దేవాయం. రాజకీయాలలో ఎదురేలేకుండా ఎదిగిపోవాలి అనుకునే వారికి అదే అంతిమ లక్ష్యం. అక్కడ మాట్లాడే ప్రతి మాటా ఒక ఫిరంగి మాదిరిగా ప్రకంపనలను పుట్టిస్తుంది. ఆ వేదిక సాక్షిగా ఎన్నో సంచలన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే అసెంబ్లీ ప్రాంగణం. రాష్ట్ర దశ, దిశను మార్చే ప్రతి నిర్ణయాకు అది ఒక సజీవ సాక్షం. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు అటు నాయకులకు, ఇటు విలేఖరులకు వారధిగా నిలిచేది అసెంబ్లీ లాబీలే. సమావేశాల కవరేజ్‌కు వెళ్లే విలేఖరులకు లాబీలే పెద్ద న్యూస్‌ సోర్స్‌ క్రియేటర్స్‌. అక్కడ నాయకగణం నోటి నుంచి వచ్చే ప్రతి మాట రాష్ట్ర వ్యాప్తంగా బ్రేకింగ్‌ న్యూస్‌ రూపంలో క్షణాల్లో చేరిపోతుంది. కొంతమంది నాయకులు కేవలం సంచనాలంకోసం పనిలేక పోయినా అక్కడకు వచ్చి మీడియాకు మంచి స్టఫ్‌ అందించి వెళుతుంటారు. అటువంటి అసెంబ్లీ లాబీల్లో ఈసారి బాతాఖానీ బంద్‌ అయిపోయింది. ఇదేమిటి లాబీల్లో మాటను కట్టడి చేయడం అంటే ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం కాదా అని ఆవేశపడిపోకండి. ఇది అనధికార బంద్‌ మాత్రమే.

విషయంలోకి వెళితే.. ముందస్తు ఎన్నికలతో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న గులాబీ పార్టీ తెలంగాణ వరకు తాము ఎదురులేని శక్తిగా భావిస్తూ వస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అఖండ విజయం అందిన కొద్ది నెలల వ్యవధిలోనే ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ పార్లమెంట్‌ ఎన్నిల్లో కారు స్పీడ్‌కు బ్రేకు వేశాయి. ఊహించని విధంగా అటు కమదళం, ఇటు కాంగీయులు అసెంబ్లీ పరాజయం నుంచి అత్యంత వేగంగా కోలుకుని పార్లమెంట్‌లో పట్టు నిలుపు కోవడంతో గులాబీ దండుకు గుబులు మొదలైంది. దీనికి తోడు ఇటీవల మంత్రివర్గ విస్తరణతో అసంతృప్త నేతలు గళం విప్పడం మొదలు పెట్టారు. పార్టీలో సీనియర్‌ నాయకుడు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తాను అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించమని కోరితే శాసన మండలికి పంపుతానని, అలాగే మంత్రి పదవి కూడా ఇస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చారని, కానీ తాజా మంత్రి వర్గంలో తనకు చోటు లేకపోవడంతో తాను మోసపోయానని మీడియా ముందు గోస వెళ్లబోసుకున్నారు.

దీనికి తోడు మంత్రి ఈటల రాజేందర్‌ ఇప్పటికే గులాబీ జెండాకు ఒక్కరే బాస్‌ కాదు, చాలామంది బాస్‌లు ఉన్నారంటూ సంచన వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీ అధినాయకత్వానికి సవాల్‌ విసిరినంత పనిచేశారు. ఈ వ్యాఖ్యలకు ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్‌ కూడా అదే వేదిక మీద మద్దతు పకడం మరింత తీవ్రతను పెంచింది. తాజాగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ను కలవడం, అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఖంగు తిన్నాయి. షకీల్‌ కోసం తీవ్రస్థాయిలో వేట కొనసాగించి ఎట్టకేలకు ఆయన్ను పట్టుకోగలిగారు. షకీల్‌ను తన వద్దకు పిలిపించుకున్న కేటీఆర్‌ ఒక మొట్టు దిగి బుజ్జగింపుకు శ్రీకారం చుట్టారు.

ఇలా పార్టీ నేతలు ఒక్కొక్కరుగా నిరసన బావుటా ఎగుర వేస్తుండడంతో కారు పార్టీ ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో అందరూ జమ అవడం, అదే సమయంలో ఈ నిరసన గళాలు మరింత రేగితే.. వాటికి మద్దతు మరిన్ని గళాలు తోడైతే పరిస్థితి ఎంత దిగజారుతుందోననే భయంతో అసలు అసెంబ్లీ లాబీల్లో ఎవరూ మీడియాతో మాట్లాడకూడదని చినసారు ఆదేశాలు జారీ చేశారట. వీటిని తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని విప్‌ల కు కూడా సమాచారం ఇచ్చారట. మొత్తానికి వాక్‌ స్వాతంత్య్రానికి వేదిక అయిన అసెంబ్లీ లాబీల్లో ఇక ఇష్‌.. గప్‌ చిప్‌..! అనమాట.

Latest Articles