Wednesday, September 22, 2021

చైతుబాబూ మీరు నాకు ఫోన్‌ చేశారా

సినిమా ప్రపంచం అంటే అనేక వింతలకు, విడ్డూరాలకు, అతిశయాలకు, ప్రమాదాలకు, పేరు, ప్రఖ్యాతులకు నిలయం. ఈ రంగంలో ఓ స్థాయికి చేరడం అంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. దానికి తోడు అదృష్టం కూడా అవసరం అనుకోండి. ముఖ్యంగా హీరోల విషయం కత్తిమీద సాము అని చెప్పాలి. స్టార్‌ స్టేటస్‌ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి చూసి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఆ స్టేటస్‌కు చేరుకుంటారు. స్టేటస్‌ పొందడం ఎంత కష్టమో.. దాన్ని నిబెట్టుకోవడం అంతకు మించిన టెన్షన్‌. ఇలా కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్‌ను తమ చేతులారా పాడుచేసుకుని తెరమరుగైన ఎందరినో చూశాం. అలాగే పెద్ద స్టార్‌ అయి ఉండి కూడా మనిషిని మనిషిగా గౌరవించే హీరోలనూ చూస్తుంటాం.

ఈ తరహా వ్యక్తిత్వం కలిగిన సినీ కుటుంబాల్లో అక్కినేని వారిది ప్రముఖమైనది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున సినిమాలకు పనిచేసిన ఎంతో మందికి వారి వ్యక్తిత్వం బాగా తెలుసు. అక్కినేని వారి మూడోతరం వారసులు నాగచైతన్య, అఖిల్‌లు కూడా తమ స్టాఫ్‌తో కలివిడిగానే ఉంటారు. ఇటీవల నాగచైతన్య తన డౌన్‌ టు ఎర్త్‌ వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

ప్రస్తుతం చైతూ ‘వెంకీమామ’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ ఫైట్‌ను చిత్రీకరించారు. అందులో ఫైటర్‌ను చైతూ పిడికిలి బిగించి గుద్దే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో టైమింగ్‌ మిస్‌ అవడం వల్ల చైతూ ఆ ఫైటర్‌ను బలoగా గుద్దేశాడు. ఆ విషయం గుద్దిన చైతూకు, దెబ్బతిన్న ఫైటర్‌కు మాత్రమే అర్ధమైంది. షాట్‌ ఓకే. అందరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఫైటర్‌ను నిజంగా గుద్దినందుకు చైతూ మనసులో బాధగానే ఉంది.

ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అతన్ని ఆ బాధ వెంటాడుతూనే ఉంది. ఇక ఆలోచించకుండా ఫైట్‌ మాస్టర్‌కు ఫోన్‌ చేసి ఆ ఫైటర్‌ నెంబర్‌ తీసుకున్నాడు. అనంతరం ఆ ఫైటర్‌కు తానే స్వయంగా ఫోన్‌ చేసి ‘‘సారీ బ్రదర్‌.. నా టైమింగ్‌ ప్రాబ్లమ్‌ వల్లే అలా జరిగింది. ఐ ఫీల్‌ వెరీమచ్‌’’ అన్నాడు. తనలాంటి ఓ సాధారణ ఫైటర్‌కు ఓ స్టార్‌ హీరో, అందునా ఓ లెజెండరీ కుటుంబానికి చెందిన హీరో ఫోన్‌ చేయడాన్ని కలలో కూడా ఊహించని ఆ ఫైటర్‌ ‘‘చైతూ బాబూ మీరు నాకు ఫోన్‌ చేశారా? ఈ విషయం నమ్మలేక పోతున్నాను. థ్యాంక్యూ బాబూ. నో ప్రాబ్లమ్‌. నాకు పెద్ద దెబ్బ తగలేదులెండి’’ అంటూ చైతూకు సమాధానమిచ్చాడట. ఇలాంటి మంచి వాతావరణం సినీ పరిశ్రమలో ఉండడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.

Latest Articles