తిరుమల కొండపై భారీగా తగ్గిన రేట్లు

0
1011

ఇప్పటిదాకా తిరుమల కొండపై నాలుగు రోజులు ఉండాలంటే ఎంతో భయంగా ఉండేది. అన్ని రోజులు కుటుంబంతో ఉండాలంటే.. ఖర్చు ఎంత అవుతుందో ఆ దేవుడికే తెలుస్తుంది. ఇడ్లి తీద్దామని హోటల్ కి వెళితే ఒక రకంగా రేట్లు వాయించేవాళ్లు. ఇడ్లి ఇరవై ఐదు రూపాయలు ఉండేది. ఇక రెండు పూట్లా భోజనం కుటుంబంతో కలిసి చేయాలంటే తడిసి మోపెడు అవుతుంది. అయితే ఇప్పుడు ఆ కష్టాలు భక్తులకు తీరాయి. ఇకపై తిరుమలపై ఉండాలంటే కుటుంబంతో ఎంతో ఆనందంగా గడపవచ్చు. కారణం.. తిరుమల కొండపై ఇప్పటి దాకా ఎడా పెడా బాదిన హోటళ్లకు దేవాదాయ శాఖ చెక్ పెట్టింది. ప్రస్తుతం రెండు ఇడ్లి ఇరవై ఐదు రూపాయలు, ప్లేట్ మీల్స్ అరవై రూపాయలు వసూళ్లు చేస్తుండగా.. ఆ రేట్లకు చెక్ పెట్టింది దేవాదాయ శాఖ.

ఇకపై రెండు ఇడ్లి కేవలం రూ.7.50 కు మించి ఉండకూడదని ఆదేశాలు ఇచ్చింది. అలానే ప్లేట్ మీల్స్‌ రూ.22.50గా నిర్ణయించింది. ఇంకా ఫుల్ మీల్స్‌కు రూ.31గా మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పుడు కొండపై 150 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 30 చిరు దుకాణాలు, 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు ఉన్నాయి. వీటిలో ఎవరైనా ఈ ధరకు మించి ఒక్క రూపాయి వసూళ్లు చేసినా టోల్‌ఫ్రీ నంబరు 18004254141కి ఫోన్ చేసి ఫిర్యాదు ఇస్తే.. ఆ హోటళ్లపై చర్యలు తీసుకుంటారు. దేవాదాయ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. భక్తులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.