నాగార్జున అలా మాట్లాడడం నన్ను బాధించింది: తమ్మారెడ్డి భరద్వాజ

0
1372

బిగ్ బాస్ 3 కి ఇంట్రడక్షన్ లో అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. బిగ్ బాస్ హౌస్ కి అక్కినేని నాగేశ్వర రావు ఇంటికి నాగార్జున ముడి పెట్టి మాట్లాడడం తనను బాధించిందని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ షో మొదట్లో నాగార్జున మాట్లాడుతూ.. నాన్న నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు తమ ఫ్యామిలీలో మొత్తం ముప్పై మంది ప్రతి ఆదివారం తప్పకుండా ఇంటికి రావాలనే ఆంక్ష పెట్టారని.. ఈ ఆంక్ష వలన కుటుంబ సభ్యులు అందరూ ఆదివారాలు కలుసుకునేవారమని.. ఇది చాలా గొప్ప విషయమని చెప్పారు. అలానే.. బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కలిసి ఉంటున్నారని నాగార్జున చెప్పారు.

అయితే అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు తమ్మారెడ్డి భరద్వాజ తప్పు పట్టారు. నాగేశ్వరరావుగారు జాతీయ సంపద అని.. అలాంటి వ్యక్తి గురించి బిగ్ బాస్ లాంటి పిచ్చి షోలలో మాట్లాడటం సరికాదని అన్నారు. నాగేశ్వరరావుగారి ఆలోచన బిగ్ బాస్ కాదని.. ఆయన ఇళ్లు బిగ్ బాస్ హౌస్ కాదని చెప్పారు. ఆత్మీయ కలయిక కోసం నాగేశ్వరరావు గారు అలా చేసేవారని అన్నారు. కానీ గెలవడం కోసం, డబ్బు కోసం చేసే షో ఈ బిగ్ బాస్ అని చెప్పారు. ఈ రెండిటికీ చాలా తేడా ఉందని.. ఈ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో తనకు తెలియదని.. ఈ మాటలు మాట్లాడే ముందు నాగార్జున అయినా కొంచం ఆలోచించాల్సి ఉండాల్సిందని అన్నారు. నాగేశ్వరరావు కుటుంబాన్ని షోతో పోల్చడం తనను బాధించిందని.. మరోసారి నాగార్జున ఇలా మాట్లాడారని భావిస్తున్నానని అన్నారు.