పోలవరం ప్రాజెక్టు విషయంలో సిఎం జగన్ సంచలన నిర్ణయం

0
541

అనున్నదే జరిగింది. పోలవరం విషయంలో అవినీతిపై ఎప్పటి నుండో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి దాకా పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న నవయుగ సంస్థను పక్కన పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనుల నుండి తప్పుకోవాలని ఇప్పటికే నవయుగ సంస్థకు నోటీసులు కూడా జారీ చేయడం విశేషం. అయితే ఈ నిర్ణయం వెనుక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో అవినీతి చోటు చేసుకుందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. అంచనాలను భారీగా పెంచి.. అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి నివేదిక అందించింది.

నివేదిక ఆధారంగా ప్రీక్లోజర్ నోటీసులను అందించింది. 60సి నిబంధన ప్రకారం పోలవరంలో హెడ్ వర్క్ పనులను నవయుగ చేస్తుండగా.. దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన పనులను నవయుగ సంస్థ చేస్తుంది. అంతేకాకుండా.. మూడువేల రెండు వందల కోట్లకు పైగా జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకోగా.. జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని ఇప్పటికే నవయుగకు ఇరిగేషన్ శాఖ సూచనలు ఇచ్చింది. దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. వరద సమయంలో ప్రాజక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలను తప్పించాలని ప్రభుత్వం నోటీసులు పంపడం మంచి పద్దతి కాదని చంద్రబాబు అన్నారు. ప్రాజక్టు పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి లేవని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు చంద్రబాబు తన ట్విట్టర్ లో స్పందించారు.