Wednesday, September 22, 2021

మంత్రి.. ఎంపీ మధ్య గ్రానైట్‌

అధికారం చేతులో ఉంటే కోట్లు దండుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి వాటిలో ఖనిజ సంపద మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో కూడా ఇసుక, గ్రానైట్‌లు బంగారు బాతుల్లాంటివి. ప్రస్తుతం తెలంగాణ లోని కరీంనగర్‌ జిల్లాలో మంత్రి, ఎంపీ మధ్య గ్రానైట్‌ చిచ్చు పెడుతోంది. ఈ వివాదంలో బీజేపీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ మంత్రుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో నడుస్తోంది. క్వారీ అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించాని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు తగిన సాక్ష్యాలను చూపించాలని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రతిసవాల్‌ విసిరారు. ఎంపీ సంజయ్‌ గ్రానైట్‌ క్వారీ యజమానులు ప్రభుత్వ పెద్దల అండతో ఖజానాకు చేరాల్సిన సీనరేజ్‌ సొమ్ము 749 కోట్లకు పంగనామం పెట్టారని ఆరోపించారు.

దీనిపై సీబీఐ ఎంక్వయిరీ చేయాలని కేంద్రానికి వినతిపత్రం ఇస్తామని కూడా చెప్పారు.
ఈ ఆరోపణను ఖండించిన మంత్రి కమలాకర్‌ ఎంపీపై ఎదురుదాడి చేస్తున్నారు. ఎంపీగారివి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు. నిజంగా అవినీతి జరిగి ఉంటే, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆయన దగ్గర ఉంటే ఇప్పటికైనా బైట పెట్టాలి. లేకపోతే మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అప్పుడు అయినా సాక్ష్యాలు ఆయన బయటకు తీయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో అద్భుతమైన ప్రజా పాలన సాగుతోంది.

ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఏవో నాలుగు సీట్లు రాగానే తెలంగాణలో విపరీతమైన ఇమేజ్‌ వచ్చేసిందని విర్రవీగుతున్నారు. అది వాపు మాత్రమే.. బలుపు కాదు. ఆ విషయం వాళ్లు గ్రహిస్తే మంచింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తి మరేదీ లేదు అంటూ మంత్రి బీజేపీపై ఫైర్‌ అయ్యారు. ఇప్పుడు మంత్రి హెచ్చరికలకు ఆధారాలతో సహా కౌంటర్‌ ఇవ్వాలని కరీంనగర్‌ ఎంపీ సంజయ్‌ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. చిలికి చిలికి ఈ గ్రానైట్‌ వార్‌ ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Latest Articles