Wednesday, September 22, 2021

‘యురేనియం’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పవన్‌?

రాజకీయాల్లో పరమపద సోపానాలు ఎక్కుతూ పైపైకి ఎగిరి పోవాలని అందరికీ ఉంటుంది. అయితే దానికితగ్గట్టుగా ప్రజల్లో ఈయన మన నాయకుడు, మనకు ఏ కష్టం వచ్చినా ముందుంటాడు అనే భరోసాను కల్పించాలి. ఆ భరోసానే భవిష్యత్తుకు పునాదు వేస్తుంది. మిగిలిన వాళ్ల లాగానే పవన్‌ కళ్యాణ్‌ కూడా రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌ కావాలని కలలు కన్నమాట వాస్తమే. కానీ అందుకు తగ్గ కార్యాచరణ మాత్రం రూపొందించుకోలేక పోయారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మిత్రుడిగా మారి టీడీపీకి ప్రచారం చేసిన ఆయన 2019 ఎన్నికలనాటికి బాబుకు దూరమై ఒంటరిగా బరిలోకి దిగి చతికిల పడ్డ విషయం తెలిసిందే. ఈ ఓటమి కారణాలు అన్వేషించే పనిని మొదలు పెట్టింది ‘జనసేన’ అధిష్టానం.

ఇందులో పార్టీ అధినాయకుడు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఏ కార్యక్రమం చేపట్టలేదని, పైగా తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ప్రజలు భావిస్తున్నారని ఫీడ్‌బ్యాక్‌ రావడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని అర్ధంచేసుకున్నారు. ముందుగా ప్రజల్లో పవన్‌ అంటే భరోసా అని అనిపించుకునే కార్యక్రమాల కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తాజాగా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల తవ్వకాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తడం గమనించారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి పవన్‌ అడుగు పెడితే బాగుంటుందని ‘జనసేన’ అధినాయకత్వం భావిస్తోంది. పైగా యురేనియం నిక్షేపాలు ఉన్ననల్లమల అటవీ ప్రాంతం ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ విస్తరించి ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాల్లోనూ పార్టీకి మంచి మైలేజ్‌ వచ్చే అవకాశం ఉంది.

దీనికి తోడు వై.యస్‌. ఫ్యామిలీకి కంచుకోట, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పులివెందుల పరిధిలోని తుమ్మపల్లిలో యురేనియం శుద్ధి కర్మాగారం ఉంది. దీన్ని 2006లో వై.యస్‌. హయాంలో నెలకొల్పారు. దీని వలన ఇప్పటికే ఆ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు కూడా పడుతున్నారు. కాబట్టి తన క్షేత్రస్థాయి పోరాటాన్ని పులివెందుల నుంచి ప్రారంభించడం ద్వారా పవన్‌ తన పార్టీకి, తద్వారా తనకు ప్రజల్లో మంచి ఇమేజ్‌ వస్తుందని భావిస్తున్నారు.

తొలుత తుమ్మలపల్లి ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేయడంతో పాటు పరిసర గ్రామాల్లో పర్యటించి వారి కష్ట, సుఖా లను తెలుసుకోవాని, ఆ తర్వాత అక్కడి నుండి నల్లమలలో సుధీర్ఘ పాదయాత్ర చేయాని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే అడవిలో పాదయాత్ర అంత ఈజీగా ఉండదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ కార్యాచరణకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఓ వైపు యురేనియం వ్యతిరేక ఉద్యమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడంతో పాటు, వైసీపీకి కుంభస్థలం వంటి పులివెందు నుంచి తన ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నారట పవన్‌.

Latest Articles