Tuesday, May 18, 2021

శంకర్‌కే షాక్‌ ఇచ్చిన చిన్నారి
సమాజంలో జరిగేవి సినిమాల్లో చూపిస్తారా.. సినిమాల్లో చూపించే వాటి వలన సమాజం ప్రభావితం అవుతుందా అంటే.. కోడి ముందా? గుడ్డు ముందా? అన్నట్లు ఉంటుంది. అయితే ప్రజలపై సినిమా ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని ఒప్పుకు తీరాల్సిందే. రెండున్నర గంటల సినిమాలో పూర్తిగా మెసేజ్‌ ఓరియెంటెడ్‌ కంటెంట్‌ నింపేస్తే ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది. అందుకే మన సినీ జనాలు తాము చెప్పదచుకున్న విషయాన్ని వినోదాత్మకంగా తెరకెక్కిస్తుంటారు. ఇలా ఎన్నో చిత్రాలు ప్రజల్లో మంచి ఆలోచనకు, నడవడికకు బాటలు వేశాయి. ఇందులో భాగంగా ఇటీవల భారతదేశం గర్వించ దగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్‌ ‘రోబో 2.0’ పేరుతో భారీ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఇది కూడా ఓ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రంగా మన్ననలు పొందింది. ఈ చిత్రంలో అంతరించిన పోతున్న పక్షి జాతుల గురించి, వాటి వలన మానవజాతికి కలిగే మేలు గురించి తనదైన శైలిలో చెప్పారు శంకర్‌. గతంలో అనేక రకాలైన పక్షులు మనకు కనపడేవి. కాలక్రమంలో వీటిలో చాలా జాతులు అంతరించే దశకు చేరుకున్నాయి. ఇందుకు ముఖ్యకారణం మనం ప్రతిరోజూ అవసరం ఉన్నా.. లేకపోయినా గంటల కొద్దీ వాడే సెల్‌ఫోన్‌లేనని, వాటికి సిగ్నల్స్‌ అందించడానికి ఏర్పాటు చేసే టవర్స్‌ నుంచి విడుదలౌతున్న ఫ్రీక్వెన్సీ వలన పక్షుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ఇదే విషయాన్ని శంకర్‌ తన చిత్రంలో చెప్పారు.

ఇటీవల శంకర్‌ కొలoబో వెళ్లడానికి చెన్నైలోని విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నారు. విమానానికి ఇంకా సమయం ఉండడంతో ఓ పక్కగా నుంచుని సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని దూరం నుంచి గమనించిన ఓ చిన్నారి ఆయన దగ్గరకు వెళ్లి ‘‘హాయ్‌ అంకుల్‌’’ అంటూ విష్‌ చేసింది. శంకర్‌ కూడా ఫోన్‌ ఆఫ్‌ చేసి పాపను దగ్గరకు తీసుకున్నారు. ఆ పాప అంకుల్‌ ‘రోబో 2.0’ సినిమా తీసింది మీరేనట కదా మా డాడీ చెప్పారు అంటూ దూరంగా ఉన్న తన తండ్రిని చూపించింది. ఆయన దూరం నుంచే శంకర్‌ను విష్‌ చేశారు. వెంటనే ఆ పాప ‘‘ఆ సినిమా నేను చూశాను. మీ సినిమాలో సెల్‌ఫోన్‌ వాడవద్దు అని చూపించారు. మరి మీరు సెల్‌ ఎందుకు వాడుతున్నారు’’ అంటూ ప్రశ్నించింది.

ఆ పాప ప్రశ్నకు ఖంగు తిన్న శంకర్‌ తేరుకుని ‘‘అది కాదు నాన్నా సెల్‌ఫోన్‌ అనేది ప్రస్తుతం మన అవసరం. నువ్వు కూడా డాడీకి రోజూ కాల్‌ చేస్తునే ఉంటావు కదా. అయితే అది మితిమీరి వాడటం వన సెల్‌ఫోన్‌ టవర్స్‌ ఫ్రీక్వెన్సీ పెంచాల్సి వస్తుంది. దాని వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌తో పక్షులు చనిపోతున్నాయి. అందుకే అవసరం ఉంటేనే సెల్‌ను వాడమని చెప్పాము. నేను కూడా ఆఫీస్‌లో ఉంటే సెల్‌ఫోన్‌ ఆఫ్‌ చేసుకుని ల్యాండ్‌లైన్‌ ఫోన్‌నే వాడుతాను’’ అని చెప్పి ఆ పాపకు ఆటోగ్రాఫ్‌ ఇచ్చి పంపారు. మనం వెండితెరమీద మెసేజ్‌లు ఇస్తే పని అయిపోతుంది అనుకుంటే చాలదు.. దాన్ని మనం కూడా ఆచరించాలి. లేకపోతే ఇలా ప్రేక్షకులకు ప్రత్యక్షంగా బహిరంగ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
Related Articles

Latest Articles