ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ ఇప్పటి నుండే ఎవరి వ్యూహాలను వాళ్ళు వేసుకుంటూ జనాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి టీడీపీ మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారిపోయాయి. ఇదంతా పక్కన పెడితే తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవ్వడం తో జగన్ చాలా అలెర్ట్ అయ్యాడు.
బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎమ్యెల్యే అభ్యర్థుల పై జనాల్లో ఏర్పడిన వ్యతిరేకతనే. సిట్టింగ్ ఎమ్యెల్యేలకు కాకుండా వేరే వాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని పలువురి వాదన. అలా వైసీపీ పార్టీ లో కూడా జగన్ రీసెంట్ గా చేసిన సర్వే ప్రకారం దాదాపుగా 40 మంది సిట్టింగ్ ఎమ్యెల్యేలకు ఈసారి సీట్లు రావడం కష్టం అని అంటున్నారు.
పవన్ కీలక వ్యాఖ్యలతో బీజేపీలో అలజడి!.
ఈ అవకాశాన్ని టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఉపయోగించుకుంటుంది. సీట్లు రాని వైసీపీ ఎమ్యెల్యేలను టీడీపీ లోకి లేదా జనసేన పార్టీ లోకి పంపేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నెలలో 20 మంది వైసీపీ ఎమ్యెల్యే లు రాజీనామా చేసి టీడీపీ – జనసేన కూటమి లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఎంఎల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేసినందుకు గాను జగన్ ఉండవల్లి శ్రీదేవి మరియు మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేసాడు. వీళ్లిద్దరు త్వరలోనే అధికారికంగా చంద్రబాబు సమక్షం లో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇకపోతే అతి త్వరలోనే ఒంగోలు వైసీపీ ఎమ్యెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా టీడీపీ లేదా జనసేన పార్టీ లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా చంద్రబాబు నాయుడు కూడా మీడియా తో మాట్లాడుతూ త్వరలోనే ఎమ్యెల్యే అభ్యర్థుల మొదటి జాబితాని విడుదల చేస్తాము, జనసేన పార్టీ తో పొత్తు ఉంది, సీట్ల సర్దుబాటు జరగాలి. అలాగే ఇతర పార్టీల నుండి వస్తున్నా వారిని కూడా ఆహ్వానిస్తున్నాము, ఎవరిని పడితే వారిని చేర్చుకోవడం లేదు. నమ్మకస్తులను మాత్రమే తీసుకుంటున్నాము. ఇవన్నీ సరిగ్గా బేరీజు వేసుకొని ఎమ్యెల్యే అభ్యర్థుల కూర్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు.