కాలం కలిసిరాకపోతే కర్రే పామై కాటేస్తుందనేది పాత సామెత.. స్వంత పార్టీ నాయకులే ఫుట్‌బాల్‌లు అవుతారనేది కొత్త సామెత. పాపం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గుంటూరుజిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ పరిస్థితి ఇలాగే మారింది.
సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, అక్కడి నుండి వైసీపీలో చేరారు.
పార్టీ అధిష్ఠానం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అంతేనా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుణ్ణి కూడా చేసింది. పదవులు అయితే దక్కాయి గానీ..
పనులు చేయించే పవర్ మాత్రం లేదు. ప్రతి చిన్న విషయానికీ జిల్లా పార్టీని గుప్పెట పెట్టుకున్న లేళ్ల అప్పిరెడ్డి దయపై ఆధారపడాల్సిన పరిస్థితి.
ఇలా మనసు చంపుకుని కొనసాగుతున్న డొక్కా వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు ఒక్కసారి జగన్‌ను చూసే భాగ్యం కల్పించాలని ఆయన బహిరంగ వేదికపై నుంచి లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఇతర పార్టీ పెద్దలను బతిమాలుకున్నారు. ఇప్పుడు ఇది వైసీపీలో రాజకీయ కుదుపుకు కారణమైంది.
అంతటితో ఊరుకోకుండా ప్రస్తుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీని వెళ్లిపోవడంతో తనకు తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారని, అక్కడికి వెళ్లి పనిచేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తుండగా 10 రోజుల తర్వాత అక్కడ నీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది పక్కకు తప్పుకోమన్నారని, ఆ తర్వాత మరల నువ్వే ఇన్‌చార్జ్‌వి అన్నారని, మళ్లీ నియోజకవర్గంలో తిరుగుతుండగా, సడన్‌గా మేకతోటి సుచరితను ఇన్‌చార్జ్‌గా ప్రకటించారని ఇలా తనను పదే పదే అవమానిస్తున్నారని ఆయన బాధను వ్యక్తం చేశారు.
డొక్కా వ్యాఖ్యలను బట్టి చూస్తే.. జగన్ డొక్కా పొలిటికల్ కెరీర్‌తో ఫుట్‌బాల్ ఆడుకున్నాడని, అందుకే కడుపు మండిన ఆయన జగన్‌ను కంటితో చూసే భాగ్యాన్ని అయినా కలిగించండి అని బహిరంగంగా వేడుకోవడం ద్వారా తన బాధను వెళ్లగక్కారని పలువురు గుసగుసలాడుకున్నారు.