మొత్తానికి అనుకున్నంతా అవుతోంది. అధికారం తెచ్చిన అహంకారంతో ప్రాణాలిచ్చే క్యాడర్‌ను, ఏది చెప్పినా వినే నాయకులను జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కరినీ దూరం చేసుకుంటున్నారు.
అసలు రాజకీయం అంటే ఏమిటో జగన్‌కు ఇప్పుడు తెలిసొస్తోంది. ఈగలు ఎప్పుడూ అధికారం అనే బెల్లం ఎక్కడుంటే అక్కడుంటాయి.
ఇక్కడ బెల్లం నిండుకుంటోంది అనే అనేమానం రావటమే ఆలస్యం వెంటనే మరో బెల్లం గడ్డను వెతుక్కుంటూ వెళ్లిపోతారు. ఆల్రెడీ తన పార్టీలో ఉన్న క్యాడర్ అంతా ఇలా వివిధ పార్టీల నుంచి వచ్చిన వారే కావడంతో ఈ విషయం జగన్‌కు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
ఎప్పుడైతే అధికార పార్టీ నుంచి వలసలు ప్రారంభం అవుతాయో.. అదే ఆ పార్టీ అధికారం కోల్పోతోందనే దానికిక సంకేతం. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రఘురామకృష్ణంరాజుతో మొదలైన తిరుగుబాటు బావుటా..
ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దగ్గర నుంచి మరల ఊపందుకుంది. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఇక ఎన్నికల వరకూ ఈ తిరుగుబాటు బావుటా ఎగురుతూనే ఉంటుంది.
నిన్నటికి నిన్న విశాఖపట్నంకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరగా, ఈరోజు కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
ఈయన చంద్రబాబు సమక్షంలో బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈయనతో పాటు విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్‌రెడ్డి, దాడి వీరభద్రరావులతో పాటు పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతనిధులు టీడీపీ కండువా కప్పుకున్నారు.
దీనికి తోడు తాజాగా రెండువ విడత టికెట్లు నిరాకరించినవారి లిస్ట్, మార్పు చేయబడిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల లిస్ట్ విడుదల కావడంతో వైసీపీ నాయకులు మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
రానున్న ఒకటి రెండు రోజుల్లో ఇప్పటికే టీడీపీ, జనసేనకు టచ్‌లోకి వెళ్లిన వారి బాటలోనే వీరు కూడా వెళ్లబోతున్నారన్నది వాస్తవం.
ఒకవేళ టీడీపీలో పోటీ చేయటానికి ఖాళీ లేకపోతే కనుక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటానికి వారంతా ప్లాన్ చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీలో అగ్రనేతగా ఉన్న విజయసాయిరెడ్డి స్వంత బావమరిదినే పార్టీ మారకుండా ఆపలేకపోవడం జగన్‌కు మరింత చిర్రెత్తుకు వచ్చేలా చేస్తుందనడంలో సందేహం లేదు.