అదేంటో గానీ అతి చేయడంలో గానీ.. చెప్పడంలో గానీ మన నాయకుల్ని మించిన వారు ఉండరు. ఇలాంటి అతిని ప్రచారం చేసే వారిని పిట్టలదొర అంటారు. ఈ పేరుతో అప్పట్లో ఆలీ హీరోగా సినిమా కూడా వచ్చింది.
తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులను తీసుకుంటే వారు చెప్పే వాటికి, చేసే వాటికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రజలు వింటున్నారు కదా అని చెప్పిందే చెపుతుంటారు.
అంతేనే వారు అంతకు ముందు ఏదైనా ఒక విషయంలో కృషి చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇక దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటారు. పదే పదే అదే విషయాన్ని చెప్పి ప్రజలకు విసుగు తెప్పిస్తుంటారు.
ఇలా పదే పదే తాను చేసిన పనిని చెప్పుకుంటూ తిరగడం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అలవాటు.
ముఖ్యంత్రిగా తాను చేసిన పనులను ప్రస్తుత విషయానికి సూటు అవుతుందో? లేదో? కూడా ఒక్కోసారి ఆలోచించరు. 1995 టీడీపీలో రేగిన అంతర్గత సంక్షోభం అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని బాగా ప్రోత్సహించిన మాట వాస్తవమే.
అయితే చంద్రబాబు తాను హైదరాబాద్‌ను ప్రపంచంతో అనుసంధానం చేశానని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. సరే అక్కడి వరకూ బాగానే ఉంది.
ఈ విషయాన్ని బేస్ చేసుకుని ప్రతి విషయాన్ని ఆ విషయంతో అనుసంధానం చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు అయిపోయింది.
తాజాగా ఈరోజు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని యన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం వెళ్ళారు చంద్రబాబు.
అక్కడ సతీమణితో కలిసి యన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నిమ్మకూరును ప్రపంచంతో అనుసంధానం చేస్తా అన్నారు.
ఇక్కడే అందరూ ఫక్కున నవ్వుకునేది. నిమ్మకూరు అనేది ఒక సాధారణ ఒక పల్లెటూరు. ఆ ఊరు ప్రపంచానికి పరిచయం అయ్యింది కేవలం యన్టీఆర్ పుట్టిన ఊరుగా మాత్రమే. ఇంతకు మించి నిమ్మకూరుకు ఎలాంటి ప్రత్యేకతా లేదు. అలాంటి నిమ్మకూరును ప్రపంచంతో అనుసంధానం చేస్తానని చంద్రబాబు అనడం విడ్డూరంగానే ఉంది.