సినిమా రంగంలో ఉండే ఇగోలు మరే రంగంలోనూ ఉండవని అంటుంటారు. నిజమే ఇక్కడ ఉండే ఇగోలు ఇంకెక్కడా ఉండవు. అలాగే ఇక్కడ ఉండే ప్రేమలు, అభిమానాలు కూడా ఇంకెక్కడా ఉండవు.
ఒకర విధంగా చెప్పాలంటే సినిమావాళ్లంత భోళా మనుషులు ఇంకే రంగంలోనూ మనకు కనిపించరు. అందులోనూ దాసరి లాంటి భోళాశంకరుడి గురించి చెప్పాలంటే…
ఈ భోళా శంకరుడు మరో భోళా మనిషి అయిన మెగాస్టార్ చిరంజీవిని ఓ కోరిక కోరారు. ఆ కోరికపై చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. అసలు దాసరి కోరిక కోరిక ఏమిటి? దానికి చిరంజీవి స్పందన ఏమిటి? తెలుసుకుందాం రండి..
అది 1995.. మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేయటానికి ప్రముఖ సినీ వారపత్రిక ‘జ్యోతిచిత్ర’ అపాయింట్‌మెంట్ సంపాదించింది. దాసరి గారితో ఆ ఇంటర్వ్యూ చేయిస్తే బాగుంటుందని భావించి దానికి చిరంజీవిని ఒప్పించారు.
ఈ సందర్భంగా దాసరి చిరంజీవిని ‘‘అతి తక్కువ కాలంలోనే తెలుగు చలనచిత్ర రంగంలో ఏ కథానాయకుడు పొందనంత ‘స్టార్‌డమ్’ను పొందావు.
కానీ జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపును పొందటానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకుంటే చూడాలని వుంది. నా కోరిక నెరవేరుతుందా? అని అడిగారు.
దీనికి చిరంజీవి తనదైన శైలిలో సమాధానమిస్తూ… ‘‘అవార్డులు పొందాలి.. అవార్డులు సంపాదించుకోవాలి అనే తపన నాలో చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే నాలో ఆ ధ్యాసే ఉండదు.
దానంతటే అదే ఏదైనా అవార్డు మనల్ని వెతుక్కుంటూ వస్తే అది ఆనందంగాను, గర్వంగాను వుంటుందన్నమాట వాస్తవం. అవార్డుల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాంటి ప్రత్యేకమైన సినిమాల్లో నటించాలనే ఆలోచన ప్రస్తుతానికైతే నాకు లేదు.
కారణం అవార్డులకంటే ఎంతో విలువైన ప్రజాభిమానాన్ని ఇంతకు అంత సంపాదించు కోవాలని, దానిని ఎలా నిలబెట్టుకోవాలా అని మాత్రమే ఆలోచిస్తూ దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను.
నేను జాతీయ అవార్డు తీసుకోవాలని మీలాంటి పెద్దలు మనస్ఫూర్తిగా కోరుకోవడం వల్ల మీ కోరికే ఆశీస్సులై భవిష్యత్తులో మీ కోరిక తీరుతుందేమో’’ అన్నారు.