జైల్లో కూర్చుని క‌థ‌లు రాసుకుంటా: రాంగోపాల్ వర్మ

0

తన మ్యుహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై రాంగోపాల్ వర్మ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై టిడిపి నేతలు ఫిర్యాదులు చేయడంతో పాటు కొందరు కేసులు నమోదు చేసారు. ఇప్పటికే రాంగోపాల్ వర్మకి నోటీసులు అందించగా.. విచారణకి మాత్రం హాజరు కాలేదు.

దీనితో గత నాలుగు రోజులుగా సినీ దర్శకుడు రామగోపాల్ వర్మని అరెస్ట్ చేయబోతున్నారంటూ మీడియా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారని కూడా వార్తలు వచ్చాయి. వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడని కూడా మీడియాలో పుకార్లు పుట్టించారు. అయితే తాను ఎక్కడికీ పోలేదని.. అసలు పోలీసులు తనని అరెస్ట్ చేస్తారని తనకు చెప్పలేదని ఏకంగా మీడియా ముందుకు వచ్చి తెలిపారు.

ఇప్పటికే మంగ‌ళ‌వారం దీనిపై ఒక వీడియో విడుదల చేశారు. సినిమా షూటింగ్‌ తీరిక లేకపోవడంతోనే పోలీసుల విచార‌ణ‌కు రావ‌డం కుదరలేదని చెప్పారు. తాజాగా రామగోపాల్ వర్మ ఓ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వర్మ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఒంగోలు పోలీసులు త‌న‌ను అరెస్టు చేయ‌డానికి రాలేదని తెలిపారు.

పోలీసులు కనీసం తన ఆఫీస్ కి కూడా రాలేదని చెప్పారు. మీడియాలో చూసి కొందరు అపోహలు పడుతున్నారని అన్నారు. మీడియాలో చూసి చాలా మంది త‌న‌కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించ‌డం చేస్తున్నార‌ని.. అది నచ్చక తన ఫోన్ స్విచ్ చేశానని తెలిపారు. తాను ఎక్కడికి పారిపోలేద‌ని.. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే, జైల్లో కూర్చుని క‌థ‌లు రాసుకుంటాన‌ని కుండ బద్దలు కొట్టారు.