ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెరుగుతున్న టికెట్ రేట్లు అనేటివి ఇటు సినీ ప్రియులతో పాటు అటు థియేటర్ యజమానులను కూడా కలవర పెడుతున్నాయి. పెద్ద సినిమాల భారీ టికెట్ల రేట్ల కారణంగా సింగిల్ థియేటర్లు.. చిన్న సినిమాలు ఇబ్బంది ఎదుర్కునే అవకాశం ఉంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ముఖ్యంగా ఇలా పెంచుకుంటూ పోతే కొన్ని రోజులకు ఆడియన్స్ థియేటర్లకు దూరమై.. ఓటీటీ లకు పరిమితమ అయ్యే అవకాశం ఉంది.
ఇండస్ట్రీని ఎప్పటినుంచో కుదేలు చేస్తున్న పైరసీ కూడా విజృంభించే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. మొదటిరోజు మొదటి ఆట చూడాలి అని కంపల్సన్ ఏమీ ఉండదు.. అదేదో క్రేజ్ లో అందరూ వెళ్తున్నారు అంతేకానీ ఈ రకంగా రేట్లు పెంచుకుంటూ పోతే ఓ వారం గడిచాక సినిమా చూడొచ్చులే అన్న అభిప్రాయం ప్రేక్షకులలో బలపడిపోతుంది. అదే జరిగితే ఇప్పుడు సినిమాలు ఎంజాయ్ చేస్తున్న భారీ ఓపెనింగ్స్ అనేటివి ఎక్కడా కుదరవు.
మామూలుగా నైజాం నుంచి కలెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి.. అలాగని అక్కడ టికెట్ రేట్లు భారీగా పెరిగితే అది దోపిడీ అవుతుంది కదా. ప్రస్తుతం పుష్ప 2 కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇచ్చింది. అయితే వీటన్నిటి మధ్యలో ఆడియన్స్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు అన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇలా టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే చివరికి నష్టపోయేది సినిమానే.. ఎందుకంటే ప్రీమియం షోలు, మొదటి రెండు మూడు రోజులు సినిమా థియేటర్లలో అభిమానుల హడావిడి ఉంటుంది.. కానీ ఆ తర్వాత టాక్ బాగుంటేనే సినిమా చూడాలి అని ఎవరైనా అనుకుంటారు. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డులు అందించే ఈ సామాన్య ప్రేక్షకులు టికెట్ రేట్లు చూసి భయపడిపోతున్నారు. సినిమా మొదటి మూడు రోజులు ఒకలా.. ఆ తర్వాత వారం రోజులు ఇంకొకలా.. తర్వాత మరొకలా టికెట్ రేట్లు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో యావరేజ్ వస్తే సినిమాని ప్రేక్షకులు లైట్ తీసుకునే అవకాశం గట్టిగా కనిపిస్తోంది.బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఇప్పటివరకు ఈ రేంజ్ లో టికెట్ రేట్లు పెంచలేదు అని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కేవలం తెలంగాణ పరిస్థితి మాత్రమే.. ఇంకా ఆంధ్రాలో టికెట్ రేట్ ల పై స్పష్టత రాలేదు.
ఈ మేరకు ఆంధ్రవాసులు రేట్లు ఏ రేంజ్ లో బాదుతారో అని భయపడుతున్నారు. మొదటి మూడు రోజుల లాభం కోసం మొత్తం చిత్రాన్ని రిస్క్ లో పెడుతున్నారేమో అని సినీ పండితులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో పుష్ప 2 విడుదల అయ్యాకే తెలుస్తుంది.