తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానుల కేకలు, పేపర్ కటింగ్స్, విజిల్స్, తెరపై ఎగిరే జనం, ముందు వరుసల్లో కూర్చున్న ఫ్యాన్స్ చేసే హంగామా అన్నీ అదిరిపోతాయి. కానీ, తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ రచ్చ ముంబైలో కూడా ఒక హీరో కోసం కనిపించిందంటే అది అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే.
ముంబైలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి శ్రీలీల ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. మహేష్‌తో కలిసి ఆమె నటించిన చిత్రం “గుంటూరు కారం” విడుదల రోజున శ్రీలీల ముంబైలో ఉండడంతో అక్కడి థియేటర్లో సినిమా చూశారట. ఆమె చెప్పిన మాటల ప్రకారం, సినిమా ప్రారంభమయ్యే సమయంలోనే మహేష్ బాబు ఎంట్రీ సీన్ కు ముంబైలో సౌత్ కంటే కూడా ఎక్కువ హడావిడి జరిగినట్లు అర్థమవుతుంది. ఇక రమణ పాత్ర ఎంట్రీ సీన్ కి అక్కడ ఆడియన్స్ విజిల్స్, క్లాప్స్ తో థియేటర్ దద్దరిల్లింది అని చెప్పింది శ్రీ లీల.
ఇంతకుముందు ముంబైలో తెలుగు హీరోకి ఇంతటి ఫ్యాన్ బేస్ ఉంటుంది అని అనుకోలేదట. మహేష్ మూవీ చూస్తూ అతని అభిమానులు చేసిన సందడితో తన చెవులు మోతెక్కిపోయాయని చెప్పిన ఆమె, మహేష్ బాబుకు అక్కడున్న అభిమానులు చూపించిన ప్రేమను చూసి ఆశ్చర్యపోయాను అని పేర్కొంది.
మహేష్ బాబుకు బాలీవుడ్‌లోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హిందీ డబ్బింగ్ రూపంలో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ చిత్రం ఆయనకు అక్కడ మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా దారావి బ్యాక్‌డ్రాప్‌లో సాగింది. దాంతో అక్కడే ఎక్కువ భాగం షూటింగ్ జరగడంతో స్థానిక ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అంతేకాకుండా మహేష్ బాబుకు బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు స్పోర్ట్స్ స్టార్లలోనూ అభిమానులు ఉన్నారు. తెలుగు సినిమాలకు సంబంధించిన హడావుడి సౌత్ తో ఆగిపోకుండా దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా ముంబై వంటి మెట్రో నగరాల్లో కూడా అదే స్థాయిలో కొనసాగడం మన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌కు సూచన.