తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్లో పెద్ద దుమారం రేపుతోంది. బెనిఫిట్ షోలపై నిషేధం విధిస్తూ, రిలీజ్ రోజున టికెట్ రేట్ల పెంపు అనుమతించబోమని సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన సినీ పరిశ్రమను కలవరపాటుకు గురిచేసింది.
ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్న సంధ్య థియేటర్స్ ఘటన వల్ల అతడిని అరెస్ట్ చేయడం, ఆ తరువాత ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ను పరామర్శించడం, ఈ అంశం రాజకీయ విమర్శలకు దారి తీసింది. ప్రతిపక్షాలు సీఎం రేవంత్‌పై కక్షపూరిత చర్యల ఆరోపణలు చేయగా, ఈ విషయంలో వివరణ ఇచ్చిన సందర్భంగా సీఎం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల అంశంపై కీలక ప్రకటన చేశారు.
ఈ నిర్ణయం టాలీవుడ్లో పెద్ద నిర్మాతలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఓ మంత్రో, ఎమ్మెల్యేనో ఈ వ్యాఖ్యలు చేస్తే తక్షణమే స్పందించే నిర్మాతలు, సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడంతో ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు. మొదట అల్లు అర్జున్‌కు సంబంధించిన విషయంగా కనిపించిన ఈ వివాదం, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై సీఎం నిర్ణయంతో ఇండస్ట్రీ మొత్తానికి సమస్యగా మారింది.
ఓటీటీ విస్తరణతో సినిమాలు మొదటి వారంలోనే వసూళ్లు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద సినిమాలు కూడా పది రోజులకు మించి థియేటర్స్‌లో నిలవడం కష్టమైపోయింది. ఈ క్రమంలో, పెద్ద నిర్మాతలు టికెట్ రేట్లు పెంచి మరీ మొదటి వారంలో భారీగా కలెక్షన్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, రేవంత్ రెడ్డి నిర్ణయం ఇందుకు అడ్డుకట్ట వేస్తోంది.
సంక్రాంతి లాంటి ప్రధాన సీజన్లో ఇలాంటి ఆంక్షలు పెట్టడం వల్ల నిర్మాతలకు భారీగా నష్టాలు వస్తాయని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ప్రొడక్షన్ కాస్ట్, హీరోల రెమ్యునరేషన్లు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి తిరిగి రావడమే కష్టమైపోయింది. టికెట్ రేట్ల పెంపు లేకుండా నిర్మాతలకు లాభాలు దొరకడం దాదాపు అసాధ్యమని వారు భావిస్తున్నారు.
ఈ నిర్ణయంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కి తరలిపోయే అవకాశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ ఏడాదికి వేల కోట్ల వ్యాపారం చేస్తుండగా, దాని నుంచి ప్రభుత్వానికి సగటున భారీగా ఆదాయం లభిస్తోంది. ప్రభుత్వ సహకారం లేకుండా నిర్మాతలు వ్యవహరించడం కష్టమని భావిస్తున్నారు. ఈ పరిణామాలు పరిశ్రమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అయితే ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలోనే హైదరాబాద్‌ని వీడని చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటుందా అనే విషయంపై కూడా పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.