నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
కథ చాలా సింపుల్‌గా, కానీ మాస్ ఫార్మాట్లో సాగుతుంది. మదనపల్లిలో టీ ఎస్టేట్ నడిపే కుటుంబానికి చెందిన జాహ్నవి అనే చిన్నపాపకు ముప్పు ఉందని తెలిసిన డాకు మహారాజ్ (బాలకృష్ణ), తన నిజ స్వరూపాన్ని దాచిపెట్టి, డ్రైవర్‌గా ఆ కుటుంబానికి రక్షకుడిగా మారతాడు. MLA, స్థానిక గ్యాంగ్‌లు, డాన్ బల్వంత్ సింగ్ ఠాకూర్ (బాబీ డియోల్) నుంచి పాపను కాపాడుతూ, తన గతంతో అతడికి ఉన్న పగను ఎలా తీర్చుకున్నాడనేదే మిగతా కథ.
ఈ సినిమా కథ కొత్తగా అనిపించకపోయినా, బాలకృష్ణ అభిమానుల కోసం బాబీ అన్ని కమర్షియల్ హంగులనూ జోడించారు. ఎలివేషన్ సీన్లు, మాస్ డైలాగులు, స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్లు సినిమాలో ప్రధాన ఆకర్షణ. బాలయ్య చేసిన కొన్ని యాక్షన్ బ్లాక్స్, ముఖ్యంగా ఇసుక తుఫాను సీన్, ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తాయి. సీతారాం డాకుగా మారే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కొంత సాగతీతగా అనిపిస్తుంది.
హీరో-హీరోయిన్ల మధ్య పాటలు కాస్త నిరాశ కలిగిస్తుంది. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, అవి ఎక్కువగా పెర్ఫార్మెన్స్కు మాత్రమే పరిమితమయ్యాయి. ఉర్వశి రౌటెలా చేసిన పాత్ర ప్రేక్షకులకు పెద్దగా కిక్ అందించలేదు.
యాక్షన్ సీక్వెన్సులకు తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి హై లైట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ ద్వారా ఉత్తరాది నేపథ్యానికి తగ్గ విధంగా విజువల్స్ అందించారు. ఈ సినిమాకు కొత్తదనం లేదనిపించినా, మాస్ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి. స్టోరీ పాతదిగా ఉన్న బాలయ్య పర్ఫామెన్స్ మాత్రం చాలా కొత్తగా ఉంది.
మొత్తంగా, “డాకు మహారాజ్” బాలకృష్ణ అభిమానులకు మాస్ ఎలివేషన్ సీన్లతో మంచి అనుభూతిని అందిస్తుంది. కానీ కథలో కొత్తదనం కోరేవారికి ఇది సగటు సినిమా అనిపిస్తుంది.