మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన ఈ సినిమా అభిమానుల్లో పెద్ద ఎత్తున అంచనాలు పెంచింది. అయితే విడుదలైన తర్వాత సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల అంచనాలకు సినిమా పూర్తిగా చేరుకోకపోయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం సత్తా చాటింది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు సృష్టించింది. విడుదలైన రెండో రోజు కూడా మంచి కలెక్షన్లను సాధించడంలో విజయవంతమైంది.
సినిమా విడుదలైన వెంటనే పైరసీ సమస్య పెద్ద చిక్కుగా మారింది. హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లోకి రావడంతో పాటు తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్, ఫిల్మీజిల్లా, టెలిగ్రామ్, ఐబోమ్మ వంటి వెబ్‌సైట్లలో ఈ సినిమా విస్తృతంగా డౌన్‌లోడ్ అవుతోంది. అంతేకాకుండా, పండుగ సీజన్‌ను పురస్కరించుకుని గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సుల్లో ఈ సినిమా ప్రింట్ ప్లే చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైరసీ సమస్యపై చిత్రయూనిట్ తగిన చర్యలు తీసుకోకపోతే భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు శంకర్ దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ అప్నన్ అనే ఐఏఎస్ అధికారిగా నటించగా, కియారా అద్వానీ దీపిక పాత్రలో కనిపించింది. అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా విడుదలకు ముందుగా అనుమతి ఇచ్చిన ప్రత్యేక షోలను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ సీజన్ కారణంగా సినిమాకు కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే పైరసీ ప్రభావం సినిమాకు ఎంతవరకు ముప్పు కలిగిస్తుందో చూడాల్సి ఉంది.