ఇండియన్ సినిమాని గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కించిన బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఇలాంటి విజయాలతో రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తనకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా అంటే అది మహాభారతం అని రాజమౌళి చాలా సందర్భాల్లో చెప్పారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ని ఏకంగా పది పార్టులుగా ప్లాన్ చేస్తున్నానని కూడా వెల్లడించారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన విషయం చర్చకు వచ్చింది. మన తెలుగు సినిమాల్లో పురాణాలు, ఇతిహాసాలకు మంచి స్థానం కల్పించిన మరో టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం పై చెక్ పెట్టబోతున్నారా అనే వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ గురించి మాట్లాడుకుంటే, ఆయన సినిమాల్లో సాహిత్యం, కథ, భావోద్వేగాల్ని మిళితం చేస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. అయితే ఆయన ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినప్పటికీ, అల్లు అర్జున్ తో చేయబోతున్న తన తదుపరి సినిమా ద్వారా ఈ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్ గురించి రూమర్స్ చూస్తే, ఇది ఒక ఫాంటసీ చిత్రంగా ఉండబోతుందని, మహాభారతానికి దగ్గరగా ఉండే కథతో ఉంటుందనే చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ దర్శకునిగా తన విశేష ప్రతిభను ఈ సినిమాలో చూపిస్తే, అది ఖచ్చితంగా ఒక ఫాంటసీ వండర్ లా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అల్లు అర్జున్ కెరీర్ లో ఇది 22వ చిత్రం కావడంతో, ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు, సినీ వర్గాల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
మరొక్కవైపు ఈ సినిమా నిజంగా మహాభారతం పైనే ఆధారపడి ఉంటే, రాజమౌళికి ఇది పెద్ద సవాలుగా మారొచ్చు. రాజమౌళి మహాభారతం కోసం ఎన్నో ప్లానింగ్ లతో ఉన్నారు కాబట్టి, త్రివిక్రమ్ దాని సమాంతరంగా సినిమా చేస్తే ఇద్దరు దర్శకుల మధ్య ఓ ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. కానీ త్రివిక్రమ్ సినిమాను ఒక పౌరాణిక గాథలా మాత్రమే చూపిస్తారా, లేక మరో కొత్త కోణంలో కథ చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా నిజంగానే మహాభారతం ప్రేరణతో ఉందా లేక పూర్తిగా వేరే ఫాంటసీ గాథనా అనేది అధికారిక ప్రకటన వెలువడితేనే తెలుస్తుంది.