టాలీవుడ్లో సినిమా హిట్ అవ్వాలా, ప్లాప్ అవ్వాలా అనేది పాక్షికంగా మ్యూజిక్ డైరెక్టర్లపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ అయితే హీరోలను పొగడ్తలతో ముంచెత్తే ప్రేక్షకులు, ఫ్లాప్ అయితే డైరెక్టర్లను ట్రోల్ చేస్తారు. కానీ మ్యూజిక్ విషయంలో మాత్రం అభిమానులు అలా చేయరు. థమన్ విషయానికి వస్తే, టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అతని మీద కొంతకాలంగా కాపీ ట్యూన్స్ ఇస్తాడని ఆరోపణలు ఉన్నా, ఆ ట్యూన్స్‌నే అభిమానులు ఎక్కువగా వినడానికి అలవాటు పడ్డారు.
థమన్ బాలకృష్ణ సినిమాలకు ఏంతో ప్రత్యేకమైన మ్యూజిక్ అందిస్తుంటాడు. ‘అఖండ’ నుంచి ‘డాకు మహారాజ్’ వరకు, ఆయన అందించిన బాణీలు బాలయ్య సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అందుకే బాలయ్య, అతడిని “నందమూరి థమన్” అని చమత్కారంగా పిలిచాడు. అయితే ఈ సంక్రాంతికి థమన్ నుంచి రెండు ప్రధాన సినిమాలు వచ్చాయి. ఒకటి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’, మరొకటి రామ్ చరణ్ – శంకర్ కాంబోలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’. ‘గేమ్ ఛేంజర్’ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, నెగటివిటీ వల్ల సినిమాపై కొన్ని ప్రతికూల ప్రభావాలు పడినట్టు మెగా అభిమానులు చెబుతున్నారు.
ఈ సినిమా HD ప్రింట్‌ను ఫైరసీ చేసి, బస్సుల్లో, స్థానిక ఛానెల్స్‌లో ప్రదర్శించారు. ఇది నిర్మాత దిల్ రాజుకు తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభలో ఈ అంశంపై థమన్ స్పందించాడు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా పేరు ప్రస్తావించకుండానే, మనమే మన సినిమాలను నాశనం చేసుకుంటున్నామని, అది ఎంత దురదృష్టకరమో తెలియజేశాడు.
థమన్ మాట్లాడుతూ, “సినిమా అనేది గొప్పది. వ్యక్తిగతంగా ఎవరి మధ్య ఏ సమస్యలున్నా, సినిమాను మాత్రం నాశనం చేయకండి. ప్రతి సినిమా అనేది ఒక కృషి ఫలితం. అది హిట్ కావడం, ఫ్లాప్ కావడం మేమే తీసుకుంటాం. కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం పెద్ద తప్పు. నిర్మాతలు మన ఆత్మల లాంటివారు. వారి కష్టం అర్థం చేసుకోవాలి,” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించాడు.
మరోవైపు, “ఇలాంటి సంఘటనలు ఇకపై ఏ సినిమాకూ జరగకూడదు. మన సినిమాలను కాపాడడం మనందరి బాధ్యత. ఓ రోజు పడుకుంటాం, రేపు లేస్తామో లేదో కూడా తెలియదు. మనకు లభించిన ఈ రోజు అనుభవాన్ని ఆనందించాలి,” అంటూ థమన్ తాను ఎంత బాధపడుతున్నాడో తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారాయి. థమన్ భావోద్వేగపు ప్రసంగం పరిశ్రమలో అనేక మంది హృదయాలను తాకింది.