పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ మూవీ లో ఉన్న ప్రభాస్ పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఇక గత ఏడాది విడుదలై ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. పురాణాలూ, ఇతిహాసాల తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కలయికతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథను తెరకెక్కించగా, ఈ సినిమా కథ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు, ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిన వేళ, ప్రస్తుతానికి సినిమా షూటింగ్ సైలెంట్‌గా మొదలైనట్లు సమాచారం. కల్కి పార్ట్ 2 లో అసలు కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగ్ అశ్విన్ నిర్ణయించారని తెలుస్తుంది. తాజాగా, ఈ సినిమా నిర్మాత అశ్వినీ దత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ముగ్గురి మధ్య కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి సీన్స్ సినిమాలో మరో స్థాయికి తీసుకెళ్తాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే, ఈ సినిమాలో దీపికా పదుకొనే, శోభన వంటి ప్రధాన పాత్రధారులు చివరి షెడ్యూల్‌లో జాయిన్ అవుతారని కూడా వెల్లడించారు. దీపిక ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చి, ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతున్నా, ఈ సీక్వెల్ కోసం పూర్తి స్థాయిలో సమయం కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రభాస్ లేని కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పటికే చిత్ర యూనిట్ పూర్తిచేసినట్లు అశ్వినీ దత్ చెప్పారు. భారీ సెట్టింగ్స్‌లో చిత్రీకరణ జరుపుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ పక్కా ప్లానింగ్ చేస్తున్నారు.
ఈ సీక్వెల్ షూటింగ్ దాదాపు పూర్తయిందని, మిగిలిన ప్రధాన పాత్రల షూటింగ్ త్వరలోనే ముగిసే అవకాశం ఉందని టాక్. నిర్మాత అశ్వినీ దత్ ప్రకారం, వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. త్వరలోనే చిత్రానికి సంబంధించిన అధికారిక అప్డేట్స్ రావచ్చని సమాచారం.
కల్కి పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియెన్స్‌కు విజువల్ ఫీస్ట్ అందించేందుకు దర్శకనిర్మాతలు ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమా ఇంతటి అంచనాలు పెంచిన కథతో, ప్రధాన తారాగణంతో, సాంకేతికంగా గొప్ప చిత్రంగా నిలవడం ఖాయం. సినిమా విడుదలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ, అభిమానుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.