రామ్ గోపాల్ వర్మలో అప్పటి కసి ఇప్పుడు సాధ్యమేనా.?

0

రామ్ గోపాల్ వ‌ర్మ అంటేనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు, వైవిధ్య‌మైన స్టోరీస్ అందించిన దర్శకుడు. కానీ గ‌త కొంత‌కాలంగా వ‌ర్మ మార్క్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక‌పోతున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసే బ‌యోపిక్‌లు, ఇతర చిత్రాలు పెద్ద‌గా విజయం సాధించలేకపోయాయి. దీనితో సినీ ఇండస్ట్రీలో ఆయ‌న స‌త్తా ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ముఖ్యంగా వివాదాస్పద అంశాలు, కోర్టు కేసులు, జైలు చిక్కులు వ‌ర్మ పేరు మరింత దెబ్బతీయడమే కాకుండా ఆయన ప్రతిష్టను తగ్గించాయి.

వ‌ర్మ కెరీర్‌లో “ముంబై ఎటాక్స్” త‌ర్వాత ఆ స్థాయిలో సినిమా చేయ‌లేదు. ఎంద‌రో అభిమానులు ఆయ‌న సినిమాలపై ఆశ‌లు పెట్టుకున్నారు కానీ, వ‌ర్మ మునుపటి దశను చేరుకోలేకపోయాడు. ఈ పరిస్థితిని గమనించిన పూరి జగన్నాథ్, విజయేంద్ర ప్రసాద్ వంటి వారు వ‌ర్మ పట్ల విచారం వ్యక్తం చేశారు. “ఇప్పటి వ‌ర్మ అంటే ఇది కాదు, మునుపటి వ‌ర్మ వేరే” అని వారు అనేక సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. కానీ, ఆ వ్యాఖ్యలు వ‌ర్మను ఆలోచింపజేయలేకపోయాయి.

ఇటీవల రీ-రిలీజ్ అయిన వ‌ర్మ “సత్య” సినిమా మళ్ళీ వర్మకు క్రేజ్ తెచ్చింది. ఈ చిత్రానికి ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో వ‌ర్మలో ఒక కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. సత్యను మళ్లీ చూసిన తర్వాత తన మొదటి దశలో ఉన్న నిజాయితీ ఇప్పుడు తగ్గిపోయిందని వ‌ర్మ స్వయంగా గ్రహించాడు. ఆ చిత్రం చూసిన తర్వాత ఆయన తనలో ఒక రకమైన ఖాళీని ఫీల్ అయ్యాడట. అప్పటి వ‌ర్మను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తానని స్పష్టం చేస్తూ వ‌ర్మ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.

అయితే, ఇది నిజంగానే వ‌ర్మకు మేల్కొలుపు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 36 ఏళ్ల వయసులో సత్య తీసిన వ‌ర్మ 62 ఏళ్ల వయసులో అదే స్థాయి సినిమాలు చేయగలరా? అనేది ప్రశ్నగా మిగిలింది. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, వ‌ర్మ తనకు అసలైన పేరును తీసుకొచ్చిన ఆ నిజాయితీ, క్రియేటివిటీని మళ్లీ తిరిగి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మార్పు వ‌ర్మలో ఎంతవరకు సాధ్యం అవుతుందో, పాత వ‌ర్మ మళ్లీ కనపడుతారా లేదా అన్న విషయం చూడాలి. భారీ విజయంతోనే వ‌ర్మ అభిమానులను, పరిశ్రమను మళ్లీ ఆశ్చర్యపరచగలరని వారి అభిప్రాయం.