నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై, అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి బాలయ్య సినీ కెరీర్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయంతో బాలకృష్ణ మరోసారి తన సినిమా మేనియా ఏ స్థాయిలో ఉందో నిరూపించారు.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశీ రౌతేల వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాకి సంబంధించిన పాటలు, బిజిఎం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజికల్ సెన్సేషన్‌గా నిలవడంతో పాటుగా సంక్రాంతి బరిలో హిట్‌గా నిలవడం గర్వకారణం.
నిన్న సాయంత్రం అనంతపురం జిల్లాలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్‌తో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలో దర్శకుడు బాబీ కొల్లి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. నందమూరి కుటుంబంపై, అఖండ సినిమాపై ఆయన చెప్పిన మాటలు ఆకర్షణీయంగా మారాయి. బాబీ మాట్లాడుతూ తమన్ గురించి విశేషంగా ప్రస్తావించారు. ఆయన స్వయంగా నందమూరి తమన్ అనే ఇంటిపేరు బాలయ్య గారే పెట్టారని, అది ఎంతో గొప్ప విషయమని తెలిపారు. తమన్‌తో తన పని అనుభవాన్ని పంచుకుంటూ, ఆయన అందించిన మ్యూజిక్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తన గత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూటింగ్ తర్వాత అఖండ సినిమా చూడడం కోసం సెకండ్ షోకి వెళ్లానని, అయితే షూటింగ్ వల్ల కలిగిన అలసటతో కొద్దిసేపు నిద్రపోయానని బాబీ చెప్పారు. కానీ అఖండ బిజిఎం వినగానే మెలుకువ వచ్చిందని, ఆ సంఘటనను సరదాగా పంచుకున్నారు. బాలకృష్ణ కూడా ఈ విషయంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం విశేషం. బాబీ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డాకు మహారాజ్ సినిమాను శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా విజయంతో బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌పై మరింత ఆసక్తి పెరిగింది.