జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు విషయంలో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది. ఈ కేసుపై వివిధ రకాల వ్యాఖ్యలు రావడంతో, జానీ మాస్టర్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ తనపై అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొన్నాడు.
ఇటీవల, జానీ మాస్టర్ ఓ ట్వీట్ చేశారు. ఇది ఇండైరెక్ట్‌గా యాంకర్ ఝాన్సీకి సంబందించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, అదే సమయంలో శ్రేష్టి వర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె చీరలో మెరిసిపోతూ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా నుంచి ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఉపయోగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది ఇది జానీ మాస్టర్‌కు ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చినట్లేనని కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే, కొన్ని రోజుల క్రితం శ్రేష్టి వర్మ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానీ మాస్టర్‌పై చేసిన కేసుపై స్పందించింది. తాను మాస్క్ వేసుకొని ఇంటర్వ్యూకు రావాల్సిన అవసరం లేదని, బాధితురాలిగా కాకుండా యోధురాలిగా ముందుకొచ్చి న్యాయం కోసం పోరాడుతున్నానని తెలిపింది. ఆమె చెప్పిన ప్రకారం, చిన్నతనంలోనే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నప్పటికీ, ఆ సమయంలో సమాజంలో ఒక శక్తివంతమైన వ్యక్తిపై పోరాడటానికి తగిన ధైర్యం, శక్తి తనకు లేకపోయిందని అన్నారు. అలాగే, ఆ వ్యక్తి మారతాడని ఎదురు చూశానని, కానీ పరిస్థితి మరింత దిగజారిందని వెల్లడించింది.
తాను తీసుకున్న నిర్ణయాన్ని కూడా వెల్లడించింది. తన ముందున్న రెండు ఆప్షన్లలో ఒకటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం, మరొకటి ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడటం. తాను రెండో మార్గాన్ని ఎంచుకున్నానని, భయపడకుండా ఈ యుద్ధం చేస్తున్నానని చెప్పింది. తన పోరాటాన్ని చూసి మరిన్ని బాధితులు ధైర్యంగా ముందుకు వస్తారనే నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నానని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, జానీ మాస్టర్ భార్యపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై ఫేక్ కేసు పెట్టేందుకు ప్రయత్నించారని, కానీ పోలీసులు ఆ కేసును స్వీకరించలేదని చెప్పింది. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ వివాదం ఇంకా ఎటువైపు మళ్లుతుందో చూడాలి. ఒకవైపు జానీ మాస్టర్ తనపై అసత్య ఆరోపణలు జరుగుతున్నాయని చెబుతుండగా, మరోవైపు శ్రేష్టి వర్మ తన పోరాటాన్ని మరింత బలంగా కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.