
సినిమా ఇండస్ట్రీలో పోటీ సహజమే. స్టార్స్ మధ్య సినిమా పరంగా పోటీ ఉంటుందేమో కానీ, వారు వ్యక్తిగతంగా మాత్రం ఎంతో ఆప్యాయతతో ఉంటారు. ఎప్పుడు కలుసుకున్నా పరస్పరం గౌరవంగా, ప్రేమగా పలకరించుకుంటారు. కానీ, ఇది ఎక్కువగా బయటకు రాదు కాబట్టి, ప్రేక్షకులు వాళ్ల మధ్య నిజంగానే వైరమే ఉందని అనుకుంటారు.
ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే, తమ అభిమాన హీరోకే మద్దతుగా ఉంటారు. ఆయనే గ్రేట్, మిగతా స్టార్లు తర్వాత అనే భావన ఫ్యాన్స్‌లో బలంగా ఉంటుంది. కానీ, సోషల్ మీడియా వచ్చాక ఈ ఫ్యాన్ వార్స్ మరింత పెరిగాయి. అంత వరకు బాగానే ఉన్నా, కొన్ని సందర్భాల్లో ఈ యాంటీ ఫ్యాన్స్ ఓ సినిమా మీద కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం, ట్రోలింగ్ చేయడం జరుగుతోంది. ఈ ప్రభావం సినిమా రిజల్ట్‌పై పడుతోంది. సినిమా బాగానే ఉన్నా, యాంటీ ఫ్యాన్స్ కావాలని నెగటివ్‌గా ప్రచారం చేస్తే, ప్రేక్షకులు మిక్స్డ్ టాక్ వచ్చినట్టుగా భావించి వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది.
ఇటీవల మరొక కొత్త సమస్య వచ్చిపడింది. పెద్ద హీరోల సినిమాల హెచ్.డి ప్రింట్లు యాంటీ ఫ్యాన్స్ కావాలని లీక్ చేస్తున్నారు. థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే ఆన్లైన్లో ఈ ప్రింట్లను అప్లోడ్ చేయడం వలన, సినిమా కంటే ముందే డిజిటల్‌గా చూసేయాలనే ఆలోచన ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ఇది సినిమా థియేట్రికల్ రన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. సినిమా ఎంత పెద్ద స్టార్దైనా, ఇలా లీక్ అయితే భారీ నష్టం తప్పదు. ఇండస్ట్రీకి ఇది చాలా ప్రమాదకరం.
ఈ పరిణామాలు పరిశ్రమ పెద్దల దృష్టికి వెళ్లాయి. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినీ పరిశ్రమలో ఎవరి మధ్యా కాంపౌండ్లు లేవని, సినిమాలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ అనవసరమైన వైరాలంటూ నెగటివ్ ప్రచారం చేయకూడదని అర్థం వచ్చేలా మాట్లాడారు. చిరంజీవి తర్వాత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పందించారు. తనకు రామ్ చరణ్ అంటే కొడుకు లాంటి అభిమానం ఉందని, ఫ్యాన్స్ మధ్య ద్వేషం పెరగకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ పరిణామాలు చూస్తుంటే, స్టార్ హీరోలంతా కలసికట్టుగా ఫ్యాన్స్ చేస్తున్న ఈ నెగిటివిటీకి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. హీరో అభిమానించడం తప్పు కాదు, కానీ మరో హీరో సినిమాకు నష్టం కలిగించాలనే ఆలోచన తప్పు. స్టార్ హీరోలు కూడా తమ ఫ్యాన్స్‌కు సూచనలు ఇవ్వాలి. పరిశ్రమ బాగు కోరే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. సినీ పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి అనవసర వివాదాలు తగ్గి, మంచి సినిమాలను ప్రోత్సహించే వాతావరణం రావాలి.