
డాకు మహారాజ్ సినిమా చూసినవాళ్లకు ఊర్వశి రౌతేలా పాత్ర గురించి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేదు. తొలి భాగంలో కొన్ని సన్నివేశాలతో పాటు ‘దబిడి దిబిడి’ అనే పాటలో కనిపించింది. అంతేకాదు, ఓ యాక్షన్ సన్నివేశంలో చిన్నగా ఫైట్ చేసింది. అయితే, ఆమె పాత్ర అక్కడితో పూర్తయిపోయింది. సినిమా సెకండాఫ్ మొత్తం ఆమె కనబడలేదు. కానీ, ఆమెకు ఈ పాత్రకుగాను ఏకంగా 3 కోట్ల పారితోషికం ఇచ్చారన్న ప్రచారం బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు అయిన మీనాక్షి చౌదరి, శ్రీలీల, మృణాల్ ఠాకూర్ లాంటి నటీమణులకు కూడా 3 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వినిపించడం లేదు. దీపికా పదుకొణె, కియారా అద్వానీ, జాన్వి కపూర్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు మంచి రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. కానీ, అవి భారీ ప్రాజెక్ట్స్ కావడం, వీరి పాత్రలు పూర్తి స్థాయిలో ఉండటంతో ఆ లెక్కలు వేరు. కానీ, డాకు మహారాజ్ లో ఊర్వశి పాత్ర తక్కువ నిడివితోనే ముగియడం, ఆమెకు 3 కోట్లు ఇవ్వడమన్న వార్తలు నిజమైతే ఆశ్చర్యమే.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి మొదట కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఊర్వశి రౌతేలా పాత్రను పూర్తిగా తొలగించారని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా వెల్లడైంది. థియేటర్లో విడుదలైన వెర్షన్ ను అలాగే ఓటీటీ లో కూడా ఉంచారు. ఊర్వశి పాత్రకు సంబంధించిన ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేయలేదు.
సినిమా విడుదల సమయంలో ఊర్వశి రౌతేలా పాత్రపై పెద్దగా చర్చ జరుగలేదు. కానీ, ఆమె రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఇప్పుడు భారీగా చర్చ జరుగుతోంది. తక్కువ నిడివి ఉన్న పాత్రకు ఇంత భారీ మొత్తం ఇస్తారా? అనే అనుమానం చాలామందికి కలుగుతోంది. మరి, నిజంగా ఆమెకు అంత భారీగా ఇచ్చారా లేదా అన్నది మాత్రం స్పష్టత రాలేదు. అయితే, డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి పాత్ర ఎలాంటి ప్రత్యేకత కలిగి లేదని ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ ద్వారా తెలుస్తోంది. సినిమా బాగానే ఆడుతున్నప్పటికీ, ఊర్వశి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, ఆమె రెమ్యూనరేషన్ గురించి మాత్రమే చర్చ నడవడం ఆసక్తికరంగా మారింది.