
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ‘పుష్ప 2’ సక్సస్ తర్వాత ఆయన ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం ప్రిపరేషన్లో ఉంది. దీనికి మైథలాజికల్ టచ్ ఉంటుందని, స్క్రిప్ట్ వర్క్ సహా డైలాగ్ వెర్షన్ ఫైనల్ చేసే దశలో ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా జరుగుతోంది. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం అనేక పరిశీలనలు జరుగుతున్నాయి.
అయితే, ఈ సినిమాకు సమాంతరంగా మరో కొత్త ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేయాలనే ఆలోచన బన్నీ వద్ద ఉందని తెలుస్తోంది.ఈ మూవీ విడుదలకు ముందు లేదా ఆ వెంటనే విడుదల చేయడానికి వీలుగా ఓ మాస్ కమర్షియల్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అందుకే, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సహకారంతో, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ప్రయత్నం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు కొనసాగుతున్నా, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ ఆలస్యం వెనుక ప్రధాన కారణం బడ్జెట్ మరియు రెమ్యూనరేషన్ లెక్కలు సరిగా కుదరకపోవడమే అని అంటున్నారు. ‘పుష్ప 2’ సినిమా కోసం బన్నీ భారీ పారితోషికాన్ని తీసుకున్నారని, మొత్తం మార్కెట్ వాల్యూలో ఆయన వాటా 27 శాతం ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంకెల ప్రకారం, దాదాపు రూ. 250 కోట్లకు పైగా బన్నీకి వస్తుందని అంచనా. ఇక అట్లీ ఇటీవలే ‘జవాన్’ లాంటి పాన్ ఇండియా హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో, ఆయన రెమ్యూనరేషన్ సుమారు రూ. 100 కోట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ రెండింటినీ కలిపితే రూ. 350 కోట్ల పైగా కేవలం హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్‌కే ఖర్చవుతుంది. పైగా ప్రొడక్షన్ ఖర్చులు, ఇతర అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల జీతభత్యాలు కూడా కలిపితే బడ్జెట్ మరింత పెరుగుతుంది. ఈ లెక్కలన్నీ బ్యాలెన్స్ చేయడానికి కొంత సమయం పడుతోంది.
మరోవైపు, త్రివిక్రమ్ సినిమా విషయంలో ఇటువంటి ఆర్థిక సమస్యలు పెద్దగా ఉండవని అంటున్నారు. ఎందుకంటే, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో, రెమ్యూనరేషన్ విషయంలో పరస్పర అంగీకారానికి రావడం తేలికగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. అందుకే, త్రివిక్రమ్ సినిమా ముందుగా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం వీటి గురించిన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ ముందుగా సెట్స్‌పైకి వెళుతుందో త్వరలో తెలియనుంది. బన్నీ కెరీర్లో మరో పాన్ ఇండియా సినిమాగా ఏది నిలిచిపోతుందో చూడాలి.