ప్రదీప్ రంగనాథన్ అదిరిపోయిన కమ్‌బ్యాక్ – ‘డ్రాగన్’ విజయయాత్ర!

0

ప్రదీప్ రంగనాథన్ పేరు కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్. జయం రవి హీరోగా తెరకెక్కిన “కోమలి” ద్వారా దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్, ఆ సినిమా మోస్తరు విజయాన్ని అందుకుంది. కానీ, అతనికి అసలు బ్రేక్ “లవ్ టుడే” మూవీతో వచ్చింది. తనే హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయింది. యూత్‌ను విపరీతంగా ఆకర్షించడంతో, తెలుగులో కూడా డబ్బింగ్ చేయబడింది. తెలుగులోనూ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, ప్రదీప్‌కు ఇక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చేసింది.

ధనుష్ లానే సింపుల్ లుక్స్ ఉన్నా, ప్రదీప్‌ను స్టార్ట్‌లో హీరోగా ఊహించలేకపోయారు చాలామంది. కానీ, “లవ్ టుడే” సినిమాతో తన నటన, డైరెక్షన్ స్కిల్స్ ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు మరోసారి తన టాలెంట్‌ను “డ్రాగన్” (తెలుగులో “రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్”) సినిమాతో నిరూపించుకున్నాడు. “ఓ మై కడవులే” ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ అయిన తర్వాత కూడా, యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.

“లవ్ టుడే” లాంటి స్ట్రాంగ్ ఎంటర్‌టైనర్ కాకపోయినా, ఇందులో ఫన్, ఎమోషన్ బాగానే వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్లలో ప్రదీప్ నటనకు థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, కాయదు లోహర్ గ్లామర్ కూడా సినిమా కోసం ప్లస్ అయింది. మొదటివారం నుంచే ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. తమిళంతో పాటు, తెలుగులో కూడా శని, ఆదివారాల్లో సూపర్ ఆక్యుపెన్సీ కనిపించింది.

కలెక్షన్ల పరంగా చూస్తే, “డ్రాగన్” ఇప్పటికే 60 కోట్ల మార్క్‌ను అందుకుంది. తెలుగు వెర్షన్ కూడా బాగానే రాణిస్తుండటంతో, ఇది 100 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. “లవ్ టుడే” తరహాలో భారీ బ్లాక్‌బస్టర్ కాకపోయినా, ఈ సినిమా ద్వారా ప్రదీప్ తన మార్కెట్‌ను మరింతగా పెంచుకున్నాడనే చెప్పాలి.