చిత్ర రంగానికి సంబంధించి నందమూరి తారకరామారావు. పాత్ర ఏదైనా ఒదిగి పోవడం అన్నగారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనడం అతిశయోక్తి కాదు. పౌరాణికమైనా.. జానపదమైనా.. సాంఫీుకమైనా పాత్ర స్వభావాన్ని బట్టి సహజత్వం కోసం పరితపిస్తారు యన్టీఆర్. పౌరాణిక పాత్రల్లో నటించే సమయంలో నిజమైన ఆభరణాలు, బరువైన గదలు వంటి వాటిని వాడేవారట. కారణం అడిగితే మనం నిజమైన(బరువైన) గదను భుజాన పెట్టుకుంటేనే కదా మొహంలో హావభావాలు సహజంగా ఉండేది’’ అంటారు అన్నగారు.
అప్పుడంటే వయస్సులో ఉన్నారు. కానీ ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా సమయానికి ఆయన 70 ఏళ్లు దాటి పోయారు. అయినా రిస్క్ విషయంలో తగ్గలేదు. ఆ సినిమాలో శ్రీహరితో ఓ ఫైట్ సన్నివేశంలో రైలు ఇంజన్ మీద నుంచి క్రింద ఉన్న బ్రిడ్జి మీదకు దూకాలి. రైలు ఇంజన్ నుంచి బ్రిడ్జి మధ్య దూరం 8 అడుగు. పైగా ఆ బ్రిడ్జి కూడా పెద్ద వెడల్పు లేదు. డూప్ సిద్ధంగా ఉన్నారు. కానీ కో డైరెక్టర్‌తో తానే దూకుతానని చెప్పారు యన్టీఆర్. దీంతో అటు నిర్మాత అయిన మోహన్‌బాబుకు, ఇటు దర్శకుడు రాఘవేంద్రరావుకు ఒకటే టెన్షన్. ఈ వయసులో ఆయన బ్యాలెన్స్ తప్పి కింద పడితే.. ఏదైనా ఫ్రాక్చర్ అయితే పరిస్థితి ఏమిటి మల్లగుల్లా లు పడుతున్నారు.
ఇక లాభం లేదు అని దర్శకుడు రాఘవేంద్రరావు పెద్దాయన దగ్గరకు వెళ్లి మీరు అంత ఎత్తు నుంచి ఈ వయసులో దూకితే ఎలా అన్నారట. దానికి పెద్దాయన ‘‘చూడండి.. వయస్సు నా శరీరానికి, నాలోని నటుడికి కాదు. దూకే విషయం నటుడికి వదిలేసి మీరు షాట్ రెడీ చేసుకోండి’’ అన్నారట. ఇక ఆయన మాటంటే శాసనమే కదా.. చేసేది లేక రాఘవేంద్రరావు షాట్ రెఢీ చేసుకున్నారు. యాక్షన్ అనగానే అన్నగారు టైమింగ్ మిస్ కాకుండా కరెక్ట్‌గా ఆ చిన్న బ్రిడ్జ్ మీద బ్యాలెన్స్ తప్పకుండా దూకేశారట.