
సినిమా: పట్టుదల
నటీనటులు: అజిత్,త్రిష ,అర్జున్ , రెజీనా కసాండ్రా ,ఆర్ణవ్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్
నిర్మాతలు: సుభాస్కరన్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మగిల్ తిరుమణి
‘పట్టుదల’ సినిమా కథను ప్రారంభించిన విధానం ఎంతో బోరింగ్‌గా ఉంటుంది. హీరో, హీరోయిన్ల ప్రేమ, పెళ్లి, ఎడబాటు వంటి సన్నివేశాలు చాలా రొటీన్‌గా సాగుతాయి. తొలి అరగంటలోనే సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. కథ నెమ్మదిగా ముందుకు సాగుతున్నా, థ్రిల్లర్ మూమెంట్ ఎప్పుడైనా వస్తుందేమో అనే ఆశ కలుగుతుంది. అయితే, సన్నివేశాలు క్రమంగా వస్తూ పోతూ ఉండటమే తప్ప, ఏదీ ఆసక్తిని రేకెత్తించదనే చెప్పాలి.
కథనం సాగుతున్న విధానం చూసినప్పుడు ఇది కిడ్నాప్ డ్రామాగా అనిపిస్తుంది. కానీ థ్రిల్లర్ అనిపించే అంశాలు చాలా తక్కువ. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎలాంటి సన్నివేశాలు ఉండవు. ఏదైనా పవర్ఫుల్ ఎపిసోడ్ వస్తుందేమో అనుకుంటే, అలాంటిదేమీ జరగదు. హీరో తొలిసారి తిరగబడే యాక్షన్ సీన్ మాత్రం కొంత బాగుంది. కానీ విలన్ బ్యాక్ స్టోరీలోనూ ప్రత్యేకత ఉండదు. హీరో తన మిషన్‌ను ప్రారంభించిన తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ కథ పరంగా మాత్రం ఎక్కడా కనెక్ట్ అయ్యేలా అనిపించదు. సినిమా కోసం ఎంచుకున్న అజర్బైజాన్ లొకేషన్ ప్లస్ అవ్వాల్సింది కానీ, చాలాచోట్ల అది మైనస్‌గానే మారింది.
నటీనటుల విషయానికొస్తే, అజిత్ తన సాదారణ మాస్ సినిమా ఇమేజ్ నుంచి బయటికి వచ్చి కథ ప్రధానమైన పాత్రలో నటించడం విశేషమే. కానీ అతని నటన వల్ల ఈ సినిమాకు పెద్దగా ప్రత్యేకత రాలేదు. పాత్ర పరంగా అజిత్‌కు చెప్పుకోదగిన అవకాశాలు లేకపోవడం వల్ల, తన ముద్ర వేయలేకపోయాడు. త్రిష తన పాత్రను హుందాగా పోషించింది. ఆమె లుక్, నటన బాగున్నప్పటికీ, పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అర్జున్, రెజీనా విలన్లుగా బాగా చేశారు. కానీ వాళ్ల పాత్రలకు బలం లేకపోవడం కారణంగా వారి పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించలేకపోయాయి. బిగ్ బాస్ ఫేమ్ ఆర్ణవ్ తన నెగటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటుల విషయం పెద్దగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
సాంకేతికంగా పరిశీలించినప్పుడు, అనిరుధ్ ఈ సినిమా విడుదలకు ముందే పెద్దగా ప్రమోట్ చేయకపోవడంతోనే అందరికీ కొన్ని అనుమానాలు వచ్చాయి. సినిమా చూసిన తర్వాత వాటికి సమాధానం దొరికినట్టే. పాటలు ప్రేక్షకులను మెప్పించలేదు. నేపథ్య సంగీతం కూడా అంతగా ప్రభావం చూపించలేకపోయింది. ఛాయాగ్రహణం మాత్రం బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు మెరుగ్గా ఉన్నాయి. కానీ కథ, స్క్రీన్‌ప్లే పరంగా డైరెక్టర్ మగిల్ తిరుమణి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా రూపొందించలేకపోయాడు. ట్విస్టులు చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. ఈ తరహా థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులు ఇప్పటికే అలవాటు పడిపోయారు. అందువల్ల కొత్తదనం లేకుండా డల్ స్క్రీన్‌ప్లేతో సినిమాను నడిపించడం చాలా కష్టమని చెప్పాలి.
మొత్తానికి ‘పట్టుదల’ సినిమా ప్రేక్షకులకు నిరాశే మిగులుస్తుంది. కథనానికి గట్టి పట్టు లేకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది.