
త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ దర్శకత్వంలో అకీరా నందన్ తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యినప్పటి నుండి తన కొడుకు అకీరా నందన్ని ప్రతి వేడుక, పబ్లిక్ ఈవెంట్లకు వెంట తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అకీరా నందన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
అకీరా నందన్ సినిమాల్లోకి రాబోతున్నారని గత కొంత కాలంగా అనేక వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను కమిట్ అయిన మూడు సినిమాలను పూర్తిచేసి, రాజకీయాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతారని, ఇక తన కొడుకు సినీ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో అకీరా నందన్ తొలి సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ తన డైరెక్షన్ డెబ్యూ చిత్రంగా అకీరా నందన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రిషి మనోజ్ ఇప్పటికే తన తండ్రి దగ్గర డైరెక్షన్ గురించి చాలా నేర్చుకున్నాడు. అయితే త్రివిక్రమ్ ఇంకా ఎక్కువ అనుభవం రావాలనుకుని, సందీప్ రెడ్డి వంగా దగ్గర రిషి మనోజ్ పని చేయాలని సూచించారట. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రంలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగా స్టైల్ చూస్తే, చాలా వైల్డ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్లను డిజైన్ చేయడంలో దిట్ట. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ లాంటి సినిమాలు చూస్తే ఆయన మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అకీరా నందన్ కూడా తన మొదటి సినిమాలో వైల్డ్ లుక్‌తో కనిపించబోతున్నారని టాక్. అలాంటి పాత్ర చేయాలంటే తప్పకుండా మంచి డైరెక్షన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. అందుకే రిషి మనోజ్, సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు వారి కొడుకులు కలిసి ఓ సినిమా చేస్తారంటే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అకీరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడా? ఏ బ్యానర్ లో సినిమా మొదలవుతుందా? అన్న ప్రశ్నలకు త్వరలోనే స్పష్టత రానుంది.
ఇదే నిజమైతే, అకీరా నందన్ – రిషి మనోజ్ కాంబినేషన్ టాలీవుడ్లో కొత్త జోష్ తెస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంటుంది.