అక్కినేని ఫ్యామిలీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు వరుస సినిమాలతో మంచి సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాగేశ్వర్ రావు నుంచి నాగార్జున వరకు అందరూ తమదైన ముద్ర వేశారు. నాగచైతన్య కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. ఏదో కొన్ని హిట్లు అతని ఖాతాలో పడుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
చైల్డ్ ఆర్టిస్టుగా సిసింద్రీ సినిమాలో నటించిన అఖిల్ ఆ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా అఖిల్ అనే సినిమా ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించినా, ఆ సినిమా యావరేజ్ టాక్ మాత్రమే అందుకుంది. ఆ తర్వాత మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి సినిమాల్లో కనిపించినా అవి కూడా పెద్దగా విజయవంతం కాలేదు. చివరగా భారీ అంచనాలతో విడుదలైన ఏజెంట్ సినిమా పూర్తిగా విఫలమైంది. ఇది అఖిల్ అభిమానులను నిరాశపరిచింది.
ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలన్నీ కథల పరంగా పరవాలేదనే చెప్పుకుంటున్నా, అవి ప్రేక్షకులను బలంగా ఆకర్షించలేకపోయాయి. అఖిల్ కష్టపడుతూ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించినా, అవి హిట్ టాక్‌ను పొందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ నగర్లో అఖిల్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయనే చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ హీరోల పేర్లలో ‘నాగ’ అనే పదం తప్పనిసరిగా ఉంటుంది. నాగేశ్వర్ రావు నుంచి నాగ చైతన్య వరకు ఈ సంప్రదాయం కొనసాగింది. ఇది వారి కుటుంబానికి అదృష్టం తెస్తుందని భావిస్తున్నారు. కానీ అఖిల్ పేరులో ‘నాగ’ అనే పదం లేదు. దీనివల్లే ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అఖిల్ పేరు ముందు ‘నాగ’ యాడ్ చేసుకుంటే ఆయన పరిస్థితి మారుతుందని, హిట్లు వస్తాయని అభిమానులు నమ్ముతున్నారు. ఈ విషయంపై అఖిల్ స్పందిస్తాడా, లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అఖిల్ కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందట. మార్చిలో అఖిల్ పెళ్లి పీటలెక్కబోతున్నాడన్న వార్త అభిమానుల్లో హర్షం కలిగిస్తోంది.
అఖిల్ తన కెరీర్లో మార్పు కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తాడా? లేదా పేరు మార్పు ద్వారా అదృష్టం సంపాదించుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యువ హీరోకు సరైన విజయాలు రావాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.