
అల్లు అర్జున్ గురించి సినీ పరిశ్రమలో ఎంతగానో చర్చ జరుగుతోంది. ప్రతి స్టార్ హీరోకి భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారి అభిమానులు తమ హీరో ఏం చేసినా, ఏం మాట్లాడినా కరెక్ట్ అని భావించి ఫ్యాన్ వార్స్ జరుపుతుంటారు. ఇదే కారణంగా కొన్ని సందర్భాల్లో హీరోలపై కూడా నెగిటివిటీ పెరిగిపోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. కొన్ని నిర్ణయాలు, కొన్ని వ్యాఖ్యల వల్ల కామన్ ఆడియెన్స్‌లో బన్నీపై ద్వేషం పెరిగినట్టుగా కనిపిస్తోంది. అందుకే అల్లు అర్జున్ గురించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా అది హాట్ టాపిక్ అవుతోంది.
ఇటీవలే ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ అనే మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో వచ్చి సంచలనంగా మారింది. టాలీవుడ్ నుండి హాలీవుడ్ స్థాయికి బన్నీ వెళ్లిపోతున్నాడా? అనే చర్చ మొదలైంది. ఇది చూసి బన్నీ అభిమానులు చాలా ఆనందంగా ఫీలయ్యారు. ఈ మ్యాగజైన్ కోసం బన్నీ ప్రత్యేకంగా ఫోటోషూట్ చేయడమే కాకుండా, ఒక ఇంటర్వ్యూకూ హాజరయ్యాడు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ రోజువారీ జీవితంలో ఏమి చేస్తాడనే ప్రశ్నకు ఓ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. షూటింగ్ లేకపోతే ఏం చేస్తాడు అని ప్రశ్నించగా, తాను ఏం చేయనని బదులిచ్చాడు. “నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ చేయను. అసలు పుస్తకం కూడా చదవను. ఏమీ చేయకుండా ఉండడమే నాకు ఇష్టం” అని చెప్పాడు. సాధారణంగా హీరోలు తమ ఖాళీ సమయాన్ని వర్కౌట్, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం వంటి వాటితో గడుపుతారు. కానీ బన్నీ మాత్రం ఖాళీగా ఉండటానికే ఆసక్తి చూపిస్తాడని చెప్పడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం బన్నీ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ‘పుష్ప 2’తో ఆయన స్థాయిని మరింత పెంచుకున్నాడు. సినిమా విడుదలైనప్పుడు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వచ్చాయి. ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి, దేశవ్యాప్తంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘పుష్ప’ ఫ్రాంచైజీ వల్ల అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరిగింది.
బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారని తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఆసక్తి అందరిలో ఉంది. మరో పక్క బన్నీ వ్యక్తిగతంగా ఏం చేసినా, ఏం మాట్లాడినా అది హాట్ టాపిక్ అవ్వడం అతని క్రేజ్‌ను చూపిస్తుంది.