దుబాయ్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది సినీ అభిమానులను ఎంతో ఉత్సాహపరిచాయి. ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, విజయ్, యష్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్లు తనకు ఎంతో సన్నిహితమైన వారు అని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, అక్కడి సినీ ప్రియులకు తన ప్రత్యేక అభిమానం ఉందని తెలిపారు.
షారుఖ్ నవ్వుతూ, ఉత్సాహంగా తన మాటలను చెప్పడం అభిమానులను మరింత ఆకర్షించింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని, దక్షిణాది సినీ పరిశ్రమతో తనకు మంచి అనుబంధం ఉందని స్పష్టం చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్‌ను గౌరవంగా రజనీ సర్, కమల్ సర్ అంటూ సంబోధించడం కూడా అందర్నీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా షారుఖ్ తన సరదా శైలిలో టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ల డ్యాన్స్ ప్రతిభపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది నటులు చాలా వేగంగా డ్యాన్స్ చేయడం మానుకోవాలని, వాళ్లతో పాటు స్టెప్పులు వేయడం తనకు చాలా కష్టమవుతోందని సరదాగా చెప్పారు. ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ల ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టైల్‌ను ప్రస్తావిస్తూ, వాళ్ల డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది అభిమానులను సంపాదించిందో గుర్తు చేశారు.
చరణ్, బన్నీ లాంటి స్టార్ల డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్ స్టార్లు కూడా టాలీవుడ్ నటుల ప్రతిభను అంగీకరిస్తూ ప్రశంసించడం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే. ముఖ్యంగా ‘పుష్ప’ లో అల్లు అర్జున్ స్టెప్పులు, ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్ చరణ్, తారక్ డ్యాన్స్ గురించి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖ నటుడు వీరి ప్రతిభను ప్రశంసించడం దక్షిణాది సినీ పరిశ్రమకు మరింత ప్రాముఖ్యతను తీసుకువస్తుంది.
ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ల ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్ ఇలా అన్ని పరిశ్రమలతో కలిసి ఈ స్టార్ హీరోలు స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ షారుఖ్ చేసిన ఈ వ్యాఖ్యలే. ఇలా సినీ ఇండస్ట్రీల మధ్య బంధం మరింత పెరుగుతూ పోవడం అభిమానులకు ముచ్చటైన అనుభూతిని ఇస్తోంది.