
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో, నేషనల్ స్థాయిలో అతని క్రేజ్ మరింత పెరిగింది. అందుకే ఆయన తదుపరి సినిమాలు మరింత గ్రాండ్‌గా ఉండబోతున్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అసలు ఈ ఫేజ్‌లో అల్లు అర్జున్ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించాడు. కానీ స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. అయితే, ఈ గ్యాప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఇప్పటికే అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. గతంలోనూ ఈ కాంబినేషన్ గురించి పలు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు మాత్రం దీనిపై క్లారిటీ వచ్చిందని, అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని టాక్.
అట్లీ ఇటీవల ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో తన మార్క్ చూపించాడు. ఇప్పుడు ఆయన స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కనిపించనున్నాడని అంటున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్ట్‌కు హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
అసలు పుష్ప 2 సినిమాలో జాన్వీ కపూర్‌ను ఒక ఐటెమ్ సాంగ్ కోసం పరిశీలించారు. కానీ ఆమె పూర్తి స్థాయి హీరోయిన్‌గా అవకాశం రావాలనే ఉద్దేశంతో ఆ ఛాన్స్‌ను వదులుకుంది. ఇప్పుడు అట్లీ-అల్లు అర్జున్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె చేసిన స్ట్రాటజీ వర్కౌట్ అయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా చాలా క్రేజీగా ఉండబోతోందని టాక్. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారని సమాచారం. గతంలో అట్లీ ‘జవాన్’ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లలో చాలామంది ఇప్పుడు ఈ సినిమాకూ పని చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు అల్లు అర్జున్ కథను పరిశీలిస్తున్నారని, కొన్ని మార్పులు అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ కూడా తన స్క్రిప్ట్ మీద ఇంకా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అట్లీ సినిమా ముందుగా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉండటంతో, అభిమానులు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.