వెకేషన్ మోడ్ లో బన్నీ.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేది అప్పుడే

0

అల్లు అర్జున్ ఇటీవల తన సినిమాలతో భారీ విజయాలను నమోదు చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన మొదటి రోజే రూ. 294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా రూ. 1900 కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడం అతన్ని తీవ్ర భావోద్వేగాలకు గురి చేసింది. ఈ ఘటన కారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి రావడం, జైల్లో ఒక రోజు గడపాల్సిన పరిస్థితి రావడం బన్నీకి మానసిక ఒత్తిడిని కలిగించింది.

ఈ సంఘటనలు అతనిపై తీవ్ర ప్రభావం చూపించడంతో, కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ సమస్యలు, వివాదాలు అన్నీ కలిసి తన మనసును ఎంతగానో దెబ్బతీశాయని, ఈ కారణంగా కుటుంబంతో కలసి తీరికగా ఉండాలని భావిస్తున్నారని సమాచారం. తన భార్య, పిల్లలతో కలిసి లాంగ్ వెకేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. ఇది అతనికి ఓ మానసిక ఉపశమనం కలిగించే అవకాశం అని భావిస్తున్నారట.

ఇకపోతే బన్నీ అభిమానులు అతని తదుపరి సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన తదుపరి చిత్రం ఉండబోతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయమై క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, బన్నీ మూడునుండి ఆరు నెలల వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చే అవకాశం ఉందట. ఈ విరామం తర్వాతే త్రివిక్రమ్ మూవీపై పూర్తిగా దృష్టిపెడతారని తెలుస్తోంది.

త్రివిక్రమ్ ఈ చిత్రానికి ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశారని సమాచారం. ఇందులో సోషల్ మైథాలజికల్, ఫాంటసీ ఎలిమెంట్లు ఉంటాయని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ కథపై కొన్ని మార్పులు సూచించగా, వాటిపై త్రివిక్రమ్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారని సమాచారం. బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే బన్నీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని, అందుకే త్రివిక్రమ్ కథను మరింత మెరుగుపరచడానికి సమయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.

ఇది చూసుకుంటే, బన్నీ సినిమాల నుంచి ప్రస్తుతానికి కొంత విరామం తీసుకున్నా, అతని రాబోయే ప్రాజెక్ట్‌పై పట్టు మాత్రం సడలడం లేదు. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ తన పనిని పూర్తి చేయాలని భావిస్తున్నారని, దీంతో తిరిగి పూర్తి ఎనర్జీతో బన్నీ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా, అభిమానులు మాత్రం బన్నీ మళ్లీ వెండితెరపై దర్శనమివ్వడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.