
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన లైగర్ సినిమా ఎంతగానో ఆశలు పెట్టుకున్నా, విడుదల తర్వాత తీవ్రంగా నిరాశ పరిచింది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమా, భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది. విజయ్ దేవరకొండ అభిమానులు సినిమా ఫలితంతో తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. ఇదివరకు ఇడియట్, పోకిరి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన ఈ సినిమా కూడా అలాంటి హిట్ అవుతుందని భావించారు. కానీ ఊహించని విధంగా సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో పూరి కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడింది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్గా నటించింది. అయితే సినిమా భారీ ప్లాప్ కావడంతో, ఆమె బాలీవుడ్లో కూడా కొన్ని మంచి అవకాశాలను కోల్పోయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, లైగర్ సినిమాను తాను ఒప్పుకోవడానికి తన తండ్రి చంకీ పాండే కారణమని చెప్పింది. సినిమాపై స్పష్టత లేకపోవడం వల్ల తొలుత చేయాలా వద్దా అని ఆలోచించానని, కానీ పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు, విజయ్ దేవరకొండ లాంటి హీరో ఉండడంతో ఇది హిట్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో తన తండ్రి ఒప్పించారని చెప్పింది.
తాజాగా చంకీ పాండే కూడా ఈ అంశంపై స్పందించారు. లైగర్ ఫలితం తనను తీవ్రంగా నిరాశపరిచిందని, తన కూతురికి ఈ సినిమా చేయమని చెప్పడం తప్పుడు నిర్ణయమేనని అంగీకరించారు. అనన్యకి తొలుత సినిమా చేయాలనే ఆసక్తి లేకపోయిందని, ఆమె పాత్ర కూడా అంత బలంగా ఉండదని భావించిందని తెలిపారు. కానీ ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్, హిట్ అయితే మంచి పేరు వస్తుందని అనుకుని తాను ఒప్పించానని చెప్పారు. కానీ చివరికి అనన్య ఊహించినదే నిజమైందని, ఆమె పాత్ర, లుక్ విషయంలో విమర్శలు వచ్చాయని అన్నారు.
అలాగని ప్రతి సినిమా విజయం సాధిస్తుందని చెప్పలేమని, కెరీర్లో కొన్ని తప్పనిసరి ఫ్లాప్‌లు వస్తూనే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అనన్య ఏ సినిమా చేయాలన్నా తన ఇష్టం ఉండదని, పూర్తిగా స్వతంత్రంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. లైగర్ ప్లాప్ అయిన తర్వాత అనన్య మాటలు నిజమయ్యాయని, తనే సరిగ్గా నిర్ణయం తీసుకోవాల్సిందని తెలుసుకున్నానని తెలిపారు.
అసలు చూస్తే ముంబై బ్యూటీలకు టాలీవుడ్ అంటే కొత్త కాకపోయినా, ఫ్లాప్ అయితే మాత్రం ఇలా విమర్శలు చేసేస్తుంటారు. ఇదే తీరుగా సౌత్‌లో అవకాశాలు దక్కించుకుని, తరువాత ప్లాప్ అయితే ఇదే టోన్‌లో మాట్లాడిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. హిట్ అయితే తమ ప్రతిభ వల్ల అని, ఫ్లాప్ అయితే దర్శకుడు, కథ కారణం అని చెబుతారు. లైగర్ విషయంలోనూ ఇదే జరిగింది. ముంబై భామలు హిట్స్ సాధిస్తే పొగడ్తలు పొందతారు, కానీ ఫ్లాప్ అయితే మాత్రం తప్పెవరిదో చూపించే ప్రయత్నం చేస్తారు.