మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ విజువల్ వండర్‌గా, చిరంజీవి మార్క్ కమర్షియల్ అంశాలను మేళవించి తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదట సంక్రాంతి 2025కి విడుదల కావాల్సి ఉన్నా, షెడ్యూల్ ఆలస్యం కారణంగా ఇప్పుడు వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించారు. అందులోనూ, ఏప్రిల్ 2025లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
విశ్వంభర తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడితో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది. చర్చలు కూడా పూర్తికాగా, ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి 2025 జులై నుంచి చిరంజీవి బల్క్ డేట్లు ఇచ్చినట్లు సమాచారం. అనిల్ రావిపూడి, తన ప్రత్యేకమైన కమర్షియల్ టచ్‌తో తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు. చిరంజీవి తన గత ప్రాజెక్ట్‌ల సమయంలో అనిల్ రావిపూడి మేకింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కాంబినేషన్లో సినిమా పూజా కార్యక్రమాలు 2025 జనవరి 15నజరగబోతున్నాయని తెలుస్తోంది. సినిమా మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి స్టైల్లో ఎఫ్2 తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండే అవకాశముందని టాక్. చిరంజీవి అభిమానులకు ఇది మునుపెన్నడూ లేని సంబరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
అనిల్ రావిపూడి సినిమా మేకింగ్ స్పీడ్ లో నంబర్ వన్ . తన ప్రతి సినిమాను సంక్రాంతికి తీసుకురావాలన్న తన కోరికకు అనుగుణంగా, చిరంజీవితో రూపొందించబోయే ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. గత సినిమాల విజయాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తానికి, చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా మెగా అభిమానులకు పెద్ద పండుగను అందించనుంది. చిరంజీవి మార్క్ కమర్షియల్ అంశాలతో పాటు అనిల్ రావిపూడి స్పెషల్ కామెడీ టచ్ ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.