
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దశల వారీగా కొనసాగుతుండగా, సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కథ, కథనానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా పూర్తిగా అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని, మహేష్ బాబు వరల్డ్ జర్నీ చేస్తున్నట్టుగా కథ ఉంటుందని అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇందులో కథానాయికగా ఎంపికయ్యిందని రూమర్లు వచ్చాయి. అలాగే, మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు, మరో హాలీవుడ్ నటి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సినిమా తెరకెక్కించడంలో ఎలాంటి లీకులు రాకుండా చిత్రబృందం కఠిన జాగ్రత్తలు తీసుకుంటోంది. యూనిట్లో పనిచేస్తున్న నటీనటులు, టెక్నీషియన్లు అందరూ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ (NDA) కుదుర్చుకున్నారని సమాచారం. అంటే సినిమా గురించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అర్థం. రాజమౌళి గత చిత్రాల విషయానికొస్తే, ఆయన ఎప్పుడు తన విజన్‌ను ఫాలో అవుతూ సినిమాలను రూపొందిస్తారు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, SSMB 29 కూడా అత్యంత గ్రాండ్‌గా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంతకు ముందుగా ‘బాహుబలి’ రెండు భాగాలుగా తెరకెక్కినట్లు, ఇప్పుడు ఈ సినిమా కూడా మల్టీపార్ట్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. సినిమా మొత్తం మూడు భాగాలుగా రూపొందుతుందా అనే గాసిప్స్ ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, మొదటి భాగం పూర్తయిన వెంటనే రెండో భాగాన్ని షూట్ చేస్తారా? లేక మధ్యలో మహేష్ బాబు మరో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్న ప్రశ్నలు అభిమానులను కాస్త ఆలోచనలో పడేశాయి. ప్రభాస్ ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు సమర్పించుకున్నట్టుగా, మహేష్ కూడా ఈ సినిమాకు అంత కాలం డెడికేట్ చేయాల్సి వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు ఈ వార్తలపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రాజమౌళి మల్టీపార్ట్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా తెరకెక్కించిన అనుభవం ఉండటంతో, SSMB 29 కూడా అదే రీతిలో ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, మహేష్ అభిమానులు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి ఏ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టినా అత్యంత గ్రాండ్‌గా డిజైన్ చేసి, విజయవంతం చేయడం ఖాయం. KL నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా గ్లోబల్ లెవల్లో ఘన విజయం సాధించనుందని ఇండస్ట్రీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి.