
నాగచైతన్య ఇటీవలే “తండేల్” సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఆయన వరుస పరాజయాల తర్వాత వచ్చిన హిట్ కావడం విశేషం. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే సోమవారం నుంచి కలెక్షన్లు కాస్త తగ్గినట్లు కనిపించినా, మొత్తంగా నిర్మాతలకు ఇది సేఫ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఈ చిత్రానికి సుమారు రూ. 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. రెండు ఏరియాలు మినహా మిగతా చోట్ల అల్లు అరవింద్, బన్నీవాసు సొంతంగా విడుదల చేశారు. ఇప్పటివరకు సినిమా రూ. 60 కోట్ల గ్రాస్ దాటినట్లు టీమ్ చెబుతోంది. కానీ వాస్తవంగా పది కోట్ల వరకు తక్కువగానే ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ షేర్ సుమారు 30 కోట్ల వరకు వచ్చిందని అంచనా వేయొచ్చు. నాన్-థియేట్రికల్ హక్కులను రూ. 60 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ లెక్కన నిర్మాతలు లాభాల్లో ఉన్నారని చెప్పొచ్చు.
ఇప్పుడీ సినిమా విజయంతో చైతన్య కొత్త ప్రాజెక్టుపై ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయన మాస్, యాక్షన్ నేపథ్యంతో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండనుందని ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందనుందని సమాచారం. నాగచైతన్య ఇప్పటివరకు మాస్ ఇమేజ్‌లో కనిపించిన సందర్భాలు తక్కువే. అయితే ఈ ప్రాజెక్ట్ మాత్రం పూర్తిగా యాక్షన్ ప్రధానంగా ఉండబోతుందట. బోయపాటి మార్క్ మాస్ మసాలా సినిమాగా రూపొందనుందని చెబుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే దీనిపై నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చైతన్య ఇప్పటివరకు ఎక్కువగా లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తోనే విజయాలను అందుకున్నారు. కానీ యాక్షన్ జానర్లో చేసిన ప్రతిసారి ఫలితం అనుకున్నంత బాగా రాలేదు. ఆయనకు సరిగ్గా సరిపడని జానర్లో మరోసారి ప్రయత్నించడం అవసరమా? అనే అనుమానం కొందరిలో వ్యక్తమవుతోంది. అలాగే బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణతో చేసిన చిత్రాల ద్వారానే ఎక్కువ విజయాలను అందుకున్నారు. ఆయన ఇతర హీరోలతో చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేకపోయాయి. అల్లు అర్జున్‌తో చేసిన “సరైనోడు” సినిమా మాత్రమే యావరేజ్‌గా ఆడింది. ఈ నేపథ్యంలో చైతన్య, బోయపాటి కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
క్రేజీగా కనిపిస్తున్న ఈ కాంబో రిస్క్ ఫుల్ అని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చైతన్య మాస్ హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నా, ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది అనిశ్చితంగా మారింది. ప్రస్తుతం ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ చైతన్య ఈసారి సరికొత్త యాంగిల్లో కనిపించబోతున్నారని అంటున్నారు. ఇది నిజమే అయితే ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.