తెలుగు సినిమాల్లో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న బ్రహ్మాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హీరోగా “సింధూరం” సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన, అనంతరం విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా పలు పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 59 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ లుక్‌తో కనిపిస్తూ నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తున్న బ్రహ్మాజీ, సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.
తాజాగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సినిమా ప్రపంచంలో బౌన్సర్ల ప్రవర్తనపై పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో బ్రహ్మాజీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. స్టార్ హీరోల భద్రత కోసం నియమించిన బౌన్సర్లు, హీరోల కంటే ఎక్కువ హంగామా చేస్తూ, అభిమానులపై దాడులకు దిగడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్రహ్మాజీ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ, “ఎక్కడ చూసినా బౌన్సర్లు… వాళ్ల ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవడం లేదు. సెట్స్‌లో కూడా ఇదే తీరు,” అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కొందరిని ఆశ్చర్యపరిచినా, మరికొందరిని నవ్వుకు గురి చేశాయి.
ఇటీవల పుష్ప 2 బెన్ఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో కూడా బౌన్సర్ల ప్రవర్తన వివాదాస్పదమైంది. అభిమానులను అడ్డుకునే పేరుతో వారు దాడులకు దిగడం, అపశ్రుతులు కలగడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలు ఈ సమస్యపై మరింత చర్చకు దారితీశాయి.
నెటిజన్స్ ఆయన వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మీకు కూడా బౌన్సర్లు పెట్టించుకుని, వారిని ఎదుర్కోవాలని కొందరు హాస్యంతో వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను అల్లు అర్జున్ బౌన్సర్లను టార్గెట్ చేస్తూ చేసినవిగా అనుమానిస్తున్నారు.
ఈ సందర్భంగా కొందరు వినూత్నమైన సూచనలను కూడా పెట్టారు. “ఒక సినిమా తీసి, బౌన్సర్ల పాత్రలకు గౌరవం తెచ్చేలా చేయండి” అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మరొకరు “200 బౌన్సర్లతో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చెయ్యండి” అని సలహా ఇచ్చారు.
బ్రహ్మాజీ నిజంగా ఎవరి గురించి వ్యాఖ్యానించారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా, ఈ చర్చ సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లలో జరుగుతున్న సమస్యలపై దృష్టి సారించేలా చేసింది.