
నటుడు బ్రహ్మాజీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘లైలా’ మూవీ వివాదంపై స్పందించారు. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడకూడదని, తగిన చోట తగిన విధంగా ప్రవర్తించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా, కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు సరిగ్గా లేవని, అందువల్లే ఆ సినిమా అనవసరంగా బాయ్ కాట్‌కు గురయిందని తెలిపారు.
‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు వైసీపీ అభిమానులకు అసంతృప్తిని కలిగించాయి. ఈ కారణంగా ఆ సినిమా మీద నెగెటివ్ ప్రభావం పడిందని, నిర్మాతకు నష్టం వాటిల్లిందని చెప్పారు. సినిమా ఈవెంట్ అంటే ఆ సినిమా గురించి మాత్రమే మాట్లాడాలని, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం వల్ల అనవసరంగా గొడవలు వచ్చి, సినిమాపై ప్రభావం పడుతుందని బ్రహ్మాజీ అభిప్రాయపడ్డారు.
అలాగే, ఆయన హీరో విశ్వక్ సేన్ గురించి మంచి మాటలు చెప్పారు. విశ్వక్ ఎప్పుడూ చిన్న సినిమాలను ప్రోత్సహించే వ్యక్తి అని, తనకు తెలిసిన, తెలియని ఫిల్మ్ ఫంక్షన్లకు హాజరవుతుంటాడని చెప్పారు. మొన్న తన సినిమా వేడుకకు కూడా విశ్వక్ సేన వచ్చి, వేరే ఈవెంట్ కారణంగా ఆలస్యమైనా, గంటన్నర పాటు కారులోనే వేచి ఉన్నాడని వివరించారు. అంతవరకు ఓర్పుగా ఉన్న వ్యక్తి ఫంక్షన్‌కి వచ్చి, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదని, సినిమాకే నష్టం చేసేలా మారిందని తెలిపారు.
పృథ్వీ విషయానికి వస్తే, ఆయన కామెడీ అద్భుతంగా చేస్తారని కానీ, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు. కామెడీ యాక్టర్ అయితే నవ్వించాలి, కాబట్టి రాజకీయ వ్యాఖ్యలు చేయడం అవసరం లేదని అన్నారు. ముఖ్యంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పుకొచ్చారు.
అలాగే, తిరుపతి కొండపై రాజకీయాలు మాట్లాడకూడదనేలా రూల్ పెట్టినట్టుగా, సినిమా ఫంక్షన్లలో కూడా రాజకీయాలను తీసుకురాకూడదనే నిబంధన తీసుకురావడం మంచిదని బ్రహ్మాజీ అభిప్రాయపడ్డారు. సినిమా ఫంక్షన్లను సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే వాడుకోవాలని, వ్యక్తిగత అభిప్రాయాలను వ్యకతీకరించే వేదికగా మార్చకూడదని తెలిపారు.
పృథ్వీ చేసిన తప్పుకు క్షమాపణ చెప్పడం మంచిదని, తప్పుచేసి మళ్లీ తప్పే కాదు అని చెప్పడం సరైన విధానం కాదని బ్రహ్మాజీ అభిప్రాయపడ్డారు. రాజకీయాలు మాట్లాడాలంటే ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడాలని, సినిమా ఫంక్షన్లను అపవిత్రం చేయకూడదని హితవు పలికారు.