మొత్తానికి జగన్మోహన్రెడ్డి నిరాకరణతో బ్రాహ్మణ సంఘాల్లో ఐక్యతను తీసుకొచ్చారనే చెప్పాలి. తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచింది అన్నట్టుగా ఆయన ఒకందుకు టికెట్ నిరాకరిస్తే..
అది ఆ కులసంఘాన్ని సంఘటితం చేసింది. విజయవాడ సెంట్రల్ నుంచి ప్రస్తుతం మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన వుడా చైర్మన్‌గా కూడా పనిచేశారు.
2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి కేవలం 25 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బోండా ఉమపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వచ్చిన అత్యల్ప మెజార్టీ ఇదే కావడం విశేషం.
ఇంకో విశేషం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా బ్రాహ్మణ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా ఇదే.
తాజాగా జగన్ విడుదల చేసిన రిజెక్టెడ్ లిస్ట్‌లో మల్లాది విష్ణు కూడా ఉండటం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కాక రేపుతోంది.
ఆది నుంచి ఈ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ వస్తోంది. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక కొంత ఓటింగ్ కాంగ్రెస్ వైపుకు మళ్లింది.
ఇక్కడ కాపు ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వంగవీటి రాధాను ఇక్కడ నుంచి పోటీ చేయించాలని మొదట భావించారు జగన్.
అయితే వంగవీటి ఫ్యామిలీ పట్ల బ్రాహ్మణ ఓటర్లలో భయాందోళనలు ఉన్నాయని సర్వేల్లో తేలడంతో ఆయన్ను బందరు ఎంపీగా పోటీ చేయమన్నారు జగన్. దీంతో రాధా పార్టీ నుంచి వెళ్లిపోయారు.
వాస్తవంగా అయితే మల్లాది విష్ణు మంచి మెజార్టీతోనే గెలవాలి. కానీ ఆయన తన తల్లి పేరుతో కృష్ణలంకలో ఓ బార్ నిర్వహించడం, అందులో మందు సేవించిన కొందరు చనిపోవడంతో బ్రాహ్మణుల్లో మల్లాది విష్ణుపై వ్యతిరేకతను బాగా పెంచింది.
ఈ కారణంగానే ఆయన 25 ఓట్ల మెజార్టీతో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా జగన్ ఆయనకు టికెట్ నిరాకరించడం, వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయిస్తున్నట్లు ప్రకటించడంతో బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్నాయి.
దీంతో బుధవారం సాయంత్రం అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య, విజయవాడ బ్రాహ్మణ సంఘం తదితర సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి.
అసలు తమ సామాజిక వర్గానికి కేటాయించేదే ఒకటి రెండు స్థానాలు అని, వాటిలో కూడా కోత ఏమిటంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.