Saturday, April 17, 2021

ఎ.బి.సి.డి.లకు చంద్రబాబు కొత్త అర్ధం




ప్రజల దృష్టిని తమ వైపు ఆకర్షించడానికి రాజకీయ నాయకులు రకరకాల ఎత్తులు, పైఎత్తులు వేస్తుంటారు. అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదుకోవటానికి ఇష్టపడరు. అవకాశాలు రాకపోయినా తామే ఏదోఒక రకంగా వాటిని సృష్టించుకుని మరీ ముందుకు పోతుంటారు. ప్రజల్లో ఉన్న ఆసక్తిని అనుసరించి వారి వేష, భాషలు ఉంటాయి. ఓ స్థాయి నాయకులు అయితే ఏ వేషం పడితే ఆ వేషం వేస్తే బాగోదు. కానీ మాటల విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది. దీన్నే ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు.

ఈమధ్య పంచ్‌ డైలాగ్‌ పరంపర ఎక్కువగా మారడంతో సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాయకులు కూడా పంచ్‌ డైలాగ్‌లు వేసేస్తున్నారు. దీని కోసం కొందరు రైటర్స్‌ను కూడా సంప్రదిస్తూ ఉంటారు. పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడని టీడీపీ తాజాగా ఓ కొత్త పంచ్‌ డైలాగ్‌ను తెరమీదకు తెచ్చింది. దాన్ని కూడా చోటా, మోటా నేతలతో చెప్పిస్తే పేలదు అనుకున్నారో ఏమో గానీ మొత్తానికి చంద్రబాబు నాయుడుగారే రంగంలోకి దిగారు.

కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై మాట తూటాలు పేల్చారు. ఇందులో భాగంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ఎ.బి.సి.డి. పాలసీ కొనసాగిస్తున్నారు అని విమర్శించారు. ఆ రోడ్‌ షోకు హాజరైన వారికి ఇదేమన్నా కొత్త పథకమేమో మన వాంటీర్‌తో చెప్పి అర్జంటుగా అప్లై చేయించాలి అనుకున్నారు.

అయితే వారి ఆనందం ఒక్క నిముషం కూడా నిలువలేదు. ఎ.బి.సి.డి అంటే ‘ఎ’ అంటే అట్రాసిటీ, ‘బి’ అంటే బాదుడు, ‘సి’ అంటే కరెప్షన్‌, ‘డి’ దోపిడీ అని కొత్త అర్ధం చెప్పారు చంద్రబాబు. బాటు డైలాగ్‌కు ఓట్లు పడడం మాట పక్కన పెడితే క్లాప్స్‌ మాత్రం బాగానే పడ్డాయట.




Related Articles

Latest Articles