Wednesday, September 22, 2021

అధికారం లేకపోయినా ఆ జిల్లాలో టీడీపీ క్రేజే వేరప్పా!

పాతతరం రాజకీయాలకు నీతి, నిజాయితీ, నైతిక విలువలు అంటూ చాలా పరిమితులు ఉండేవి. వాటికి అనుగుణంగానే నాడు ఎంతో మంది తమదైన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకుని ప్రజల మన్ననలు అందుకున్నారు. అప్పుడు నాయకులు ఎక్కడుంటే అధికారం అక్కడుండేది. ఇప్పటి పాలి‘ట్రిక్స్‌’ వేరు. అధికారం ఎక్కడుంటే నాయకులు అక్కడుంటారు. అధికారం చేతిలో ఉన్నంత కాలo నా అంతవాడు లేడంటూ ఎగిరెగిరి పడుతుంటారు. ఓటమి ఎదురైందా.. ఇక అంతే సంగతులు మళ్లీ ఐదు సంవత్సరాల వరకూ గాయబ్‌. లేదా అధికార పార్టీ పంచన చేరిపోవడం.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఇందుకు భిన్నంగా కొనసాగుతున్న ఓ జిల్లా రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఘోర పరాభవం తర్వాత టీడీపీ శ్రేణులను నిస్తేజం ఆవహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరిపోయారు. వారితో పాటే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పేరున్న నాయకులు సైతం వైసీపీ గేట్లు తెరకవ పోవడంతో బీజేపీ బాట పట్టారు. మిగిలిన కేడర్‌ను కాపాడుకోవటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.

ఓ వైపు పార్టీలో నిరంతర వలసలు కొనసాగుతుంటే, మరోవైపు సిక్కోలు టీడీపీ రాజకీయాలు మాత్రం భిన్నమైన రూట్‌లో ప్రయాణిస్తూ చంద్రబాబును ఉబ్బితబ్బిబ్బు చేస్తున్నాయి. పార్టీ ఓటమి తర్వాత నియోజకవర్గాలు, జిల్లా ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు తీసుకోవటానికి బూతద్దంలో వెతుకుతుంటే సిక్కో లు జిల్లాలో మాత్రం జిల్లా నాయకత్వం కోసం టీడీపీ కేడర్‌లో విపరీతమైన పోటీ నెలకొని ఉందట. రాబోయే పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధినేత చంద్రబాబు జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకూ ఇన్‌చార్జ్‌లను నియమించటానికి నిర్ణయం తీసుకున్నారు.

గత రెండు పర్యాయాలుగా గౌతు శిరీష జిల్లా టీడీపీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా మాజీ విప్‌ కూన రవికుమార్‌ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరో వైపు అచ్చెన్నాయుడు తన వర్గానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇలా పలు వైపుల నుంచి డిమాండ్‌లు వస్తుండడంతో ఆ పార్టీ నాయకులు అధికారం లేకపోయినా ఆ జిల్లాలో టీడీపీ క్రేజే వేరప్పా అనుకుంటూ సంబర పడిపోతున్నారట.

Latest Articles