
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి గీతా ఆర్ట్స్ సంస్థ రంగం సిద్ధం చేసింది. మార్చి 7న ‘ఛావా’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో ఆస్వాదించాలని గీతా ఆర్ట్స్ కోరింది.
ఈ సినిమా శంభాజీ మహారాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. ఛత్రపతి శివాజీ కుమారుడైన శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశల్ పోషించగా, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. శంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మంచి స్పందనను అందుకుంది.
ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త కూడా వెలువడింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్లో తెలుగు వెర్షన్ విడుదలవుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇది కేవలం పుకారుగా మారిందని తెలుస్తోంది.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో గర్వంగా అనిపించిందని విక్కీ కౌశల్ తెలిపారు. శంభాజీ మహారాజ్ పాత్రలో నటించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాల్సి వచ్చిందని చెప్పాడు. సినిమా షూటింగ్ సమయంలో విక్కీ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన చేతులను రాత్రంతా తాళ్లతో కట్టేయాల్సి వచ్చిందని చిత్ర బృందం తెలిపింది. ఈ సన్నివేశం పూర్తి అయిన తర్వాత విక్కీ దాదాపు నెలన్నరపాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం.
ఇక శంభాజీ ప్రమాణ స్వీకార ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు విక్కీ భావోద్వేగానికి గురయ్యారని టీమ్ వెల్లడించింది. పాత్రలో ఒదిగిపోవడం వల్ల ఆ సంఘటనను నిజంగా అనుభవించినట్లు అనిపించిందని చెబుతున్నారు.
‘ఛావా’ సినిమా ప్రాముఖ్యతను చూస్తే, శంభాజీ మహారాజ్ జీవితం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన ధైర్యం, సమర్థత, కఠిన సమయాల్లో తీసుకున్న నిర్ణయాలు నిజంగా స్పూర్తిదాయకం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఆస్వాదించడానికి మరికొన్ని రోజులు వేచి చూడాలి. మార్చి 7న తెలుగు వెర్షన్ విడుదల కానుండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మహాపురుషుడి జీవిత కథను..ఎన్టీఆర్ వాయిస్ తో వెండితెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.