Wednesday, September 22, 2021

మాజీ మంత్రి కోడలు, మనవరాలు దారుణ హత్య

మానవత్వం మంటగలుస్తున్న అనేక సంఘటనలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కుటుంబ తగాదాల నేపథ్యంలో.. ఆస్తి పంపకాలు, వారసత్వ హక్కు నేపథ్యంలో బంధుత్వాలు, చిన్నా, పెద్దా తేడాలు కూడా మరచి మరీ నేర ప్రవృత్తిని పెంచుకుంటున్నారు. నిరక్షరాస్యులతో పాటు, ఉన్నత విద్యావంతులు సైతం ఇదే బాటను ఎంచుకోవడం తీవ్రంగా కలత చెందే విషయంగా పరిగణించాల్సిందే. ఈ కోవలోకే వస్తుంది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జంట హత్యల ఘటన.

ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన దివంగత నేత, మాజీ మంత్రి డీపీ ధ్రిత్‌లహ్రే కోడలు నేహా ధ్రిత్ ల‌హ్రే (30), మనవరాలు అనన్య ధ్రిత్ ల‌హ్రే(9)ని దారుణంగా హతమార్చారు దుండగులు. డీపీ ధ్రిత్‌ లహ్రే కుమారుడు తరుణ్‌ ధ్రిత్ ల‌హ్రే కుటుంబంతో సహా రాయ్‌పూర్‌లోని శంకర్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. తరుణ్‌ ఇంట్లోలేని సమయంలో ఈ హత్యలు జరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

ఈ సందర్భంగా సమీప బంధువు ఈ హత్యా కాండకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధ్రిత్‌ లహ్రే కుటుంబానికి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి సమీప బంధువులతో చాలా కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అతి కిరాతకంగా తల్లి, కూతుళ్లను హతమార్చారు బంధువులు.

Latest Articles