పొత్తులు, ఎత్తులతో సాగుతున్న ఏపీ రాజకీయాల్లో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ ఎవరికి టిక్కెట్టు ఇస్తుందో.. ఎవరికి నిరాకరిస్తుందో తెలియని పరిస్థితి. ఈసారి గెలుపు ఇటు వైపీసీకి అటు తెలుగుదేశం పార్టీ చావో..
రేవో అన్నట్టుగా మారింది. ఈ క్రమంలోనే తమ పార్టీ నేతలకు కొద్ది నెలలకు ముందుగానే పార్టీ గెలుపు ముఖ్యం. అవసరం అయితే ఎవరి సీటు అయినా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలని సూచించాయి.
ముఖ్యంగా తెలుగుదేశంపార్టీ తమ అభ్యర్ధుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం సర్వేలతో పాటు ఐవీఆర్ఎస్ సర్వేలను కూడా చేపట్టింది.
ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ హాట్‌సీట్ సెగలు పుట్టిస్తోంది. ఇది ప్రస్తుత ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం.
గతంలో ఇక్కడ నుంచి నిత్య వివాదాలతో సహవాసం చేసే చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో కొఠారు అబ్బయ్య చౌదరి వైసీపీ నుంచి పోటీ చేసి, అనూహ్యంగా చింతమనేనిని ఓడిరచాడు.
ఇది నిజంగా చింతమనేనికి షాక్‌గానే చెప్పాలి. ఆ ఎన్నికల్లో తన గెలుపు నల్లేరుమీద నడకేనని భావించారు చింతమనేని. కానీ ఘోర ఓటమి తప్పలేదు.
తాజాగా సీట్ల కేటాయింపులో చింతమనేనికి చంద్రబాబు హ్యాండ్ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. పొత్తలో భాగంగా జనసేనకు ఈ సీటును కేటాయించే అవకాశం ఉంది.
ఒక వేళ జనసేన కాకుండా టీడీపీనే పోటీ చేసేటట్లయితే చింతమనేనికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు.
ఈమేరకు శుక్రవారం దెందులూరు పట్టణంలో ఓ సమావేశం కూడా నిర్వహించారు. దీనికి జనసేన నేతలు కూడా హాజరయ్యారు. ఇరు పక్షాలకు చెందిన నాయకులు ముక్తకంఠంతో చింతమనేని అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఆయన దుందుడుకు చర్యల వల్ల ఇప్పటికే పార్టీకి నష్టం జరిగిందని, ఇప్పటికీ ఆయన వైఖరిలో మార్పు లేదని, టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు.
మరోసారి ఆయనకు సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని, తాము కూడా ఆ ఓటమి కోసం కృషి చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయం అధిష్ఠానం దాకా చేరడంతో ఈసారి చింతమనేనికి ఎమ్మెల్యేకు బదులుగా, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని,
కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. చూడాలి తనకు సీటు రాకపోతే చింతమనేని చింతనిప్పులు కక్కుతారో లేదో…