Saturday, July 24, 2021

నా రూమ్‌లో క్యారేజీ వద్దు తీసేయండి.. చిరంజీవి వార్నింగ్

మెగాస్టార్‌ చిరంజీవి సామాన్య నటుడిగా జీవితం ప్రారంభించి కోట్ల మందికి ఆరాధ్యదైవంగా మారిన వ్యక్తి. ఎప్పుడూ శాంతంగా కనిపించే చిరంజీవికి కూడా కోపం వస్తుందా? అనే సందేహం అందరికీ ఉంటుంది. అవును ఎప్పుడూ నవ్వుతూ.. నవ్వించే చిరంజీవికి కూడా అప్పుడప్పుడూ కోపం వస్తుంది. అయితే అది అవతల వారిని బాధ పెట్టేంత కాదు. తనని తాను బాధించుకునేంత. ఇలా చిరంజీవికి చాలాసార్లు కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘శివుడు శివుడు శివుడు’ సినిమా షూటింగ్‌. అది 1983వ సంవత్సరం.

చిరంజీవి నటించిన ‘శివుడు శివుడు శివుడు’ చిత్రం షూటింగ్‌ ఊటీలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి తొలుత ఎ. కోదండరామిరెడ్డి దర్శకుడు తొలి రోజు షూటింగ్‌ను పూర్తి చేసిన ఆయన రెండో రోజే తప్పుకున్నారు. చేసేది లేక నిర్మాత అయిన కె. క్రాంతికుమార్‌ తానే మెగాఫోన్‌ పట్టారు. సినిమాలో చిరంజీవి పాత్ర శాస్త్రీయ నాట్యం చేస్తుంది. ఇందు కోసం శాస్త్రీయ నాట్యంలో దిట్ట అయిన పసుమర్తి కృష్ణమూర్తి గారిని నియమించారు. ఆయనకు నాట్యంతో పాటు కొంచెం చాదస్తం కూడా ఉంది. దీంతో చిరంజీవి చాలా ఇబ్బంది పడ్డారు.

రిహార్సల్స్‌లో కూడా ఒంటి నిండా నగలతో చిరంజీవి చేత డాన్స్‌ చేయించేవారు. ఓ రోజు క్లిష్టమైన భంగిమ ఒకదాని విషయంలో చిరంజీవికి మాస్టారికి మధ్య చిన్న గ్యాప్‌ వచ్చిందట. దీంతో అక్కడే ఉన్న దర్శక, నిర్మాత అయిన క్రాంతికుమార్‌ గారు చిరంజీవిని మందలిస్తూ డాన్స్‌ మాస్టర్‌ ఆయనా.. నువ్వా అంటూ అప్పటికే టేక్‌ ఓకే చేయకుండా విసిగిస్తున్న మాస్టర్‌ మీద ఉన్న కోపం చిరంజీవిపై చూపించారట. దీనికి చిరంజీవి నొచ్చుకున్నారు. అయినా ఆరోజుకు షూటింగ్‌ పూర్తి చేశారు.

హోటల్‌కు వచ్చిన తర్వాత రాత్రి భోజనం తెచ్చిన ప్రొడక్షన్‌ వ్యక్తితో చిరంజీవి కోపంగా ‘‘నా రూమ్‌లో క్యారేజీ వద్దు. తీసేయండి’’ అన్నారట. విషయం తెలుసుకున్న చిరంజీవి మిత్రుడు, సినీ జర్నలిస్ట్‌, పీఆర్వో అయిన ప్రమోద్‌ కుమార్‌ చిరంజీవి రూమ్‌కు వెళ్లి ఆయన్ను అనునయించారట. అయినా చిరంజీవి నేను ప్రొడక్షన్‌ నుంచి వచ్చే భోజనం చేయను అని భీష్మించుకుని కూర్చున్నారట. పరిస్థితిని చల్లబరిచిన ప్రమోద్‌ కుమార్‌ నేను నా స్వంత డబ్బుతో చైనీస్‌ రెస్టారెంట్‌ నుంచి భోజనం తెప్పిస్తాను. ఇద్దరం కలిసి తిందాం అంటూ చిరంజీవికి నచ్చ జెప్పారట.

Related Articles

Latest Articles